న్యూశాయంపేట: ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని, వారంతా వామపక్ష ఉద్యమంలో భాగం కావాలని సీపీఐ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండకు వచ్చిన ఆయన బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40 ఏళ్ల పాటు వారి జీవితాలను త్యాగం చేశారని అలాంటి వారికి సరైన స్వేచ్ఛ, గౌరవాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. గౌరవంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండటానికి సీపీఐ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలని మొదట కోరింది తమ పార్టీనే అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాలాంటి నక్సలైట్లను వందల మందిని ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేయిందని ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షా కమ్యూనిస్టులు, మావోయిస్టులపై తన అక్కసును వెల్లగక్కారాని అన్నారు. గద్దర్‌ను నక్సలైట్ అన్నారని, అదే గద్దర్ చనిపోతే ప్రధాని మోదీ సంతాప లేఖను పంపారని గుర్తుచేశారు. కేంద్రం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటీవల క్రిష్టియన్ మతంతో చేరితే ఎస్సీ కులం హోదా రద్దు అవుతుందని వచ్చిన తీర్పు సరికాదని, ఏ మతంలో చేరినా మనిషి కులం ఎన్నటికీ మారదన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కే.భిక్షపతి, కరుణాకర్, లింగారెడ్డి, వెంకట్రాజం, జ్యోతి, స్టాలిన్, టీ.భిక్షపతి, భిక్షపతి, రాజమౌళి, శ్రీనివాస్, రవి, సాదానందం పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కంట్రోల్
కమిషన్ చైర్మన్ నారాయణ


