మహబూబాబాద్ రూరల్ : ఇంటి స్థలం పంపకాల్లో తలెత్తిన ఘర్షణ కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలోని బలరాం తండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరాం తండా గ్రామానికి చెందిన పెద్దపులి ఫకీర, బుల్లి కుటుంబానికి అతడి తమ్ముడు పెద్దపులి రవి, బుజ్జి కుటుంబానికి మధ్య ఇంటి స్థలం విషయంలో కొద్దిరోజుల క్రితం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపులి రవి, బుజ్జి దంపతుల పెద్ద కుమారుడు రాజేష్ (21) ని అతడి పెద్దమ్మ పెద్దనాన్న బుల్లి, ఫకీర, సోదరీ సరిత తిట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయంపై రూరల్ ఎస్సై దీపికను వివరణ కోరగా మృతుడి తల్లి బుజ్జి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య


