యూనిఫాం ఇండెంట్ల రద్దు | - | Sakshi
Sakshi News home page

యూనిఫాం ఇండెంట్ల రద్దు

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

టెండర్ల ద్వారా కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలు

టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలి

టెండర్ల ద్వారా కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలు

కాశిబుగ్గ: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు, ఎక్స్‌అఫీషియో రాష్ట్ర సంచాలకులు, సమగ్ర శిక్ష హైదరాబాద్‌ తరఫున ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫాం క్లాత్‌ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్‌ను ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని పవర్‌లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి. దీనిపై ఆధారపడిన వేలా దిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్కోకు ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను విద్యాశాఖ రద్దు చేసుకోవడంతో సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది.

దశాబ్దాలుగా యూనిఫాం సరఫరా..

నాలుగైదు దశాబ్దాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ఏకరూప దుస్తులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు చేనేత సహకార సంఘాలు సరఫరా చేస్తూ చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేతన్నల ఉత్పత్తులను టెస్కో ద్వారా ఖరీదు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కొత్తగా టెండర్‌ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతో కార్మికులకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్న టెండర్‌ విధానం రద్దు చేయాలని విన్నవించారు. చేనేత కార్మికుల ఉపాధి దృష్టిలో పెట్టుకుని రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా కార్మికులకు నిరాశే మిగిలింది.

విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయంతో ఆందోళన..

ఈ పరిస్థితిలో తాజాగా విద్యాశాఖ 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు, ప్రీప్రైమరీ చదువుతున్న 20,02,689 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫాం తాత్కాలిక ఇండెంట్‌ను రద్దు చేసి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించొద్దని టెస్కోను అభ్యర్థించింది. దీంతో చేనేత జౌళిశాఖ అధికారులు సైతం పీపీ ఆర్డర్లను రద్దు చేసి, లివరీ యూనిఫాం క్లాత్‌ రకాల ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని గురువారం రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాతోపాటు కరీంనగర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పవర్‌లూం, చేనేత సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేశా రు. దీనివల్ల ఇప్పటికే వివిధ శాఖల నుంచి రావా ల్సిన రూ.200 కోట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. గోదాముల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ ఉండడం, మిల్లుల్లో వస్త్రాలు తయారు చేస్తుండడం వంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక నిర్ణయం నేతన్నలను నిరాశకు గురిచేస్తోంది.

వస్త్రాల ఉత్పత్తి నిలిపివేయాలంటూ చేనేత జౌళిశాఖ ఉత్తర్వులు

లబోదిబోమంటున్న పవర్‌లూమ్‌,

చేనేత సహకార సంఘాలు

ఉపాధి కోల్పోతామని

నేత కార్మికుల ఆందోళన

ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. 2026–27 విద్యా సంవత్సరంలో రూ.105.54 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని 393 చేనేత సంఘాల్లోని వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. టెండర్‌ విధానం వల్ల కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తే సామాన్య నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో కార్మికులు పనులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని వాపోతున్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని టెండర్‌ విధానానికి స్వస్తి పలికి, గతంలో మాదిరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు వరంగల్‌లో గురువారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చేనేత సంఘాల ప్రతినిధులు మొరపెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement