రామన్నపేట : నగరంలోని ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీకృష్ణకాలనీలో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం దాడులు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.47,500 ఉంటుందని తెలిపారు. నిందితుడు లహరి ఫుడ్ క్యాటరింగ్ యజమాని సంతోష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ల
పరీక్ష ఫీజు గడువు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు, డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుంలేకుండా ఈనెల 4వ తేదీ వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 2, 4, 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించే యోచనలో పరీక్షల విభాగం అధికారులు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయా పరీక్షల టైం టేబుల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
పుట్టెడు దుఃఖంతో
పది పరీక్షకు హాజరు
స్టేషన్‌ఘన్‌పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్‌స్కూల్ సెంటర్‌లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్‌ను పలువురు ఓదార్చారు.


