నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్‌లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్ తెలిపారు.
గుట్కాల పట్టివేత
వరంగల్ క్రైం: హనుమకొండ టైలర్స్ స్ట్రీట్‌లోని శివం కిరాణా స్టోర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తులను గురువారం పట్టుకున్నట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడు రాజ్‌పుత్ చేతన్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ పలు షాపుల వారికి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైందని వివరించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడుల్లో ఎస్సై కిశోర్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మహిపాల్, తిరువర్ధన్ పాల్గొన్నారు.
స్పాట్ కేంద్రం పరిశీలన
విద్యారణ్యపురి: కాజీపేట ఫాతిమా హైస్కూల్‌లో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాష్ట్ర అబ్జర్వర్ శ్రీనివాసాచారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులు జవాబుపత్రాలు మూల్యాంకనం చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్లు వినియోగించొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. సెల్ ఫోన్ వినియోగిస్తూ స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ వ్యవహరిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్నారని సంబంధిత అధికారులు అబ్జర్వర్ శ్రీనివాసాచారికి తెలిపారు.


