మహబూబాబాద్ అర్బన్: జిల్లా పరిషత్ కార్యాలయాన్ని నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉండడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారుతోంది. అధికా రులు తమ సొంత డబ్బులతో కార్యాలయంలో తాగునీరు ఏర్పాటు, పేపర్ బిల్లులు, బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పనులు చేయిస్తున్నారు. అయితే ఎంతకాలం తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టాలని వారు వాపోతున్నారు. కాగా, అధికారులు సొంతంగా వెచ్చించిన ఖర్చులు తిరిగి రాకపోగా, నగదు చెల్లించకుండా సామగ్రిని ఇచ్చేందుకు షాపుల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్లు, జిరాక్స్‌లకు ఉద్దెర పెట్టమని, సామగ్రి ఇచ్చేందుకు షాపుల వారు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ అవసరాలకు నిధులు చెల్లించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.


