కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత.. హోటల్ నిర్వాహకుల బేజార్
సాక్షి, మహబూబాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం.. జిల్లాలోని హోటళ్ల నిర్వాహకులకు శాపంగా మారింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చిన్న హోటళ్లు మొదలుకొని పెద్ద రెస్టారెంట్ల వరకు నడవని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీకొట్లు ఉంటాయి. వీటిని నమ్ముకొని ప్రత్యక్షంగా పదివేలకు పైగా కుటుంబాలు, పరోక్షంగా పాలు, కూరగాయలు, వాటర్, ఇతర వస్తువుల సరఫరా చేసేవారు మరో పదివేల మంది బతుకుతున్నాయి. సిలిండర్ల కొరతతో వ్యాపారం తగ్గడం, హోటళ్లు మూతపడడంతో వీటినే నమ్ముకొని ఉన్న కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది.
తగ్గిన ఐటమ్స్... పెరిగిన ధరలు..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల హోటళ్ల రూపురేఖలు మారిపోయాయి. కళ్లముందు వేడివేడిగా పదార్థాలు చేసి అందించే పరిస్థితి నుంచి.. ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో చిన్న టిఫిన్ సెంటర్లలో కూడా ఇడ్లీ, వడ, బొండా, పూరి, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి టిఫిన్లు వేడివేడిగా దొరికేవి. కానీ ఇప్పుడు పూరి, ఇడ్లీ మాత్రమే అమ్ముతున్నారు. ఇవి కూడా ఆలస్యంగా చేయడం, చేసినవి సకాలంలో అమ్ముడుపోకపోతే చల్లారి పోతున్నాయి. అదే విధంగా గతంలో ప్లేట్ టిఫిన్ రూ.30 నుంచి రూ. 40 వరకు అమ్మేవారు. కానీ ఇప్పుడు ధరలు పెంచి రూ. 50 మేరకు అమ్ముతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. సగం హోటళ్లు మూత పడడంతో ఉన్న హోటళ్లు, కర్రీ పాయింట్లలో ధరలు పెంచినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం కమర్షిల్ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
టీకొట్టు మీదనే కుటుంబ పోషణ
టీ కొట్టు నిర్వహణతో వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. పదిరోజులుగా సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. బ్లాక్‌లో సిలిండర్లు కొనే స్థోమత లేక వారం రోజులు టీకొట్టు మూసి వేశాను. దీంతో చిట్టీలు, ఇంటి కిరాయి, ఇతర ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై టీ చేసుకొని వచ్చి అమ్ముతున్నాను.
– శ్రీలత, ఇందిరాగాంధీ సెంటర్, మహబూబాబాద్
కట్టెల పొయ్యిపై వంట చేసి నెట్టుకొస్తున్న కొందరు..
గ్యాస్‌లేక మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు
ఐటమ్స్ తగ్గించి.. ధరలు పెంచిన నిర్వాహకులు
జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు
కంపెనీ డీలర్లు కనెక్షన్లు
హెచ్‌పీ 04 65,288
ఇండెన్ 05 29,243
భారత్ 03 41,648
దీపం 00 34,314
ఉజ్వల 00 32,379
హాస్టల్స్(సీఎస్‌ఆర్) 00 8,659
మొత్తం 12 2,11,531
కమర్షిల్ కనెక్షన్లు 00 375


