నెహ్రూసెంటర్: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చేతుల మీదుగా డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. జిల్లాలో టీబీ కేసులను గుర్తించడం, సమయానికి చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించడంపై వైద్య సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా పురస్కారం లభించిందని తెలిపారు. ప్రజలందరూ టీబీపై అపోహలు వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
విద్యార్థులు
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నెల్లికుదురు: విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి పేరు, ప్రతిష్టలు తీసుకొచ్చేవిధంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, అంగన్‌వాడీ సెంటర్లను మంగళవారం మండల అధికారులతో కలసి సందర్శించారు. మోడల్ స్కూల్‌లో లైబ్రరీ రూం, కంప్యూటర్ గది, భోజన సౌకర్యం, వంట గది సౌకర్యాలు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మోడల్ స్కూల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పని తీరును విద్యార్థులతో కలసి పరిశీలించారు. అంగన్‌వాడీ సెంటర్‌లో సక్రమంగా సరుకులు అందుతున్నాయా లేవా.. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందుతున్న సౌకర్యాలపై టీచర్‌ను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో నూతన అంగన్‌వాడీ భవనానికి ప్రపోజల్ పంపాలని ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, ఆర్‌ఐ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు.


