మహబూబాబాద్: ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరస న కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 8.23 శాతం నిధులు కేటాయించడం దారుణమన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ సమయంలో వారికి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేసి, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు మైస శ్రీనివాస్, చుంచు శ్రీశైలం, ఉపేందర్, భిక్షపతి, రామలింగా రెడ్డి, బాబురావు, విద్యాసాగర్ పాల్గొన్నారు.


