ఆందోళన.. అయోమయం | - | Sakshi
Sakshi News home page

ఆందోళన.. అయోమయం

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

కాజీపేట రూరల్‌ : దక్షిణ మధ్య రైల్వే పరిధి విజయవాడలోని గాల (గుణదల) లోకోపైలెట్‌ డిపోపై రన్నింగ్‌స్టాఫ్‌లో ఆందోళన, అయోమయం నెలకొంది. ఇప్పటికే క్రూ లింక్‌ల తరలింపులు, అధిక పని భారంతో సతమతమవుతున్న రన్నింగ్‌స్టాఫ్‌కు గాల డిపో సమస్య కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2007లో 3 క్రూ లింక్‌లతో విజయవాడ డివిజన్‌లో గాల డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపో రన్నింగ్‌స్టాఫ్‌ విజయవాడ– బల్లార్షాకు 450 కి.మీ. అప్‌ అండ్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు.

అతిపెద్ద డిపోగా గాల..

ప్రస్తుతం గాల డిపో 45 క్రూ లింక్‌లతో అతి పెద్దగా మారింది. కాజీపేట మాత్రం 15 క్రూ లింక్‌లతో నడుస్తోంది. గాల డిపో ఏర్పాటు కాకముందు కాజీపేట స్టాఫ్‌ పని చేసేది. ఒకప్పుడు లోకోపైలెట్లు, ట్రైన్‌ మేనేజర్లతో కలిపి 1,500 మందితో కాజీపేట డిపో నడిచేది. గాల డిపో ఏర్పాటు తర్వాత కాజీపేట స్టాఫ్‌ 700కు తగ్గింది. గాల కేంద్రంగా విజయవాడ–బల్లార్షా రన్నింగ్‌స్టాఫ్‌ 900 కి.మీ. త్రూ ఆపరేట్‌ చేయడం వల్ల దాదాపు 30 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తోంది. ఫలితంగా 130 కేఎంపీహెచ్‌ స్పీడ్‌తో 3వ లైన్‌లో ఆటోమెటిక్‌ సిగ్నల్స్‌ దాటుకుంటూ విధులు చేయడం రన్నింగ్‌ స్టాఫ్‌కు ఇబ్బంది అవుతోంది. దీంతో ఇప్పటికే గాల డిపోలో పని చేస్తున్న కొందరు అనారోగ్యాల బారిన పడ్డారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గాల డిపోను ఆపరేట్‌ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2010 నుంచి వరంగల్‌లో

డిపో ఏర్పాటు ఉద్యయం..

2010 సంవత్సరం నుంచి గాల రైల్వే డిపోను ఎత్తివేసి వరంగల్‌లో డిపోఏర్పాటు చేయాలని రన్నింగ్‌స్టాఫ్‌ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌గా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బైపర్‌కేట్‌ కానున్న నేపథ్యంలో గాల డిపోను ఎత్తివేసి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని రన్నింగ్‌స్టాఫ్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

గాల డిపోను వరంగల్‌ తరలించాలి..

విజయవాడలోని గాల డిపోను వరంగల్‌కు తరలిస్తే తమపై అధిక పని భారం తగ్గుతుందని, ప్రయాణికుల భద్రత పెరుగుతుందని లోకోపైలెట్లు, ట్రైన్‌ మేనేజర్లు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి వరంగల్‌, వరంగల్‌ నుంచి బల్లార్షాకు స్టాఫ్‌ విధులు ఉంటాయన్నారు. ఫలితంగా విశ్రాంతి ఉంటుందని, దీని వల్ల విధులకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు. కాగా, 500 మంది వరకు స్టాఫ్‌ వరంగల్‌కు వస్తారని, రైల్వే శాఖకు కూడా లాభాలు వస్తాయంటు పేర్కొంటున్నారు. కాగా, గాల డిపోపై రన్నింగ్‌స్టాఫ్‌ ఉద్యమ కార్యచరణలో భాగంగా సోమవారం జేఏసీ నాయకులు సికింద్రాబాద్‌లో ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.రాఘవయ్యను, మంగళవారం మజ్దూర్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరి సి.హెచ్‌.శంకర్‌రావును కలువగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

గాల(విజయవాడ) రైల్వే డిపోపై

నెలకొన్న సందిగ్ధం

1వ తేదీ నుంచి బైపర్‌కేట్‌.. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు మారనున్న డిపో

వరంగల్‌కు తరలించాలని

లోకోపైలెట్లు, గార్డుల విజ్ఞప్తి

రైల్వే జాతీయ నేతలు రాఘవయ్య,

శంకర్‌రావుకు వినతిపత్రాలు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement