● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై
అధ్యయనం
జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్‌లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది.
పట్టణ ప్రగతి పనులు
వేగవంతం చేయాలి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన – పట్టణ ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మేయర్ గుండు సుధారాణి మంగళవారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, డ్రెయినేజీ శుభ్రత, చెత్త తొలగింపు పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
వైద్యుల నిర్లక్ష్యంతో
రోగి మృతి?
హన్మకొండ చౌరస్తా: వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ ములుగురోడ్ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం రాజుపేట గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు రోదిస్తూ ఆస్పత్రి ఆవరణలో మృతదేహంతో ఆందోళన చేశారు.


