గార్ల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జీసీడీఓ విజయకుమారి సూచించారు. బుధవారం గార్ల బాలుర ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పదో తరగతి విద్యార్థులు ఇటీవల రాసిన ప్రీఫైనల్ పరీక్షల పేపర్లను పరిశీలించారు. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను హెచ్‌ఎం గదికి పిలిపించి ఇష్టపడి చదివి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. అదేవిధంగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రమేశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏఎక్స్‌ఎల్ ప్రోగ్రాం కీలక పాత్ర
మహబూబాబాద్ అర్బన్: పాఠశాలల్లో బోధన పద్ధతులు ఆధునికీకరించి, విద్యార్థి కేంద్రంగా బోధన విధానాలు అమలు చేయడంలో ఏఎక్స్‌ఎల్ ప్రోగ్రాం కీలక పాత్ర పోషిస్తుందని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో బుధవారం అడ్వాన్స్ అనుభవ లెర్నింగ్ ప్రోగ్రాంపై శిక్షణ కార్యక్రమం నిర్వభహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ విత్తనాల సుధాకర్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఆర్‌పీలు విక్టోరియా, రమేష్, ఉషారాణి, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.
వాయిదా..
ఈ నెల 12, 13 తేదీల్లో జరగాల్సిన ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలు వాయిదా పడినట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతాయని, ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయలన్నారు.
అధిక ధరలకు
మద్యం విక్రయాలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలోని మధుర, సెవెన్ హిల్స్ వైన్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ నాయక్‌కు ఆ గ్రామ సర్పంచ్ పల్లెల రాణి, మాజీ ఎంపీటీసీ మార్క రమేశ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీను బుధవారం ఫిర్యాదు చేశారు.ఆ రెండు షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాల బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్నారు. ప్రైవేట్ సైన్యంతో బెల్ట్ షాపుల్లో రైడింగ్ నిర్వహిస్తూ, వారి ఇళ్లలో అనుమతిలేకుండా మహిళలు ఉన్నప్పటికీ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం క్వార్టర్ బాటిల్ రూ.20, ఆఫ్ రూ.40, ఫుల్ బాటిల్ రూ.80, బీరు రూ.20 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు విచారణ జరిపి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఆదివాసీ ఉపాధ్యాయుడు కృష్ణబాబుకు డాక్టరేట్
వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు డాక్టరేట్‌ను అందుకున్నారు. పేదలకు సాయం చేయాలనే సంకల్పంతో అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఎంతోమందికి సాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో సైతం పేదలకు నిత్యావసర సరుకులు అందజేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను బుధవారం ప్రదానం చేసింది.


