వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Mar 11 2026 7:55 AM | Updated on Mar 11 2026 7:55 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి సమీపంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్‌స్వామి బైక్‌ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కేసముద్రం మండలం సర్వాపురం తండాకు చెందిన లకావత్‌ బాలరాజు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేటలో ఆర్మ్‌డ్‌ విభాగంలో సిటీ గార్డ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకటరెడ్డిని ఆటో ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయాలు అలుముకున్నాయి.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యుఒడికి

దుగ్గొండి : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని తొగర్రాయి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్‌స్వామి (26) సోమవారం సాయంత్రం గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బైక్‌పై వెళ్లాడు. దర్శనం అనంతరం ఇంటికి వస్తుండగా తొగర్రాయి వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మనోహర్‌స్వామికి తీవ్రగాయాలై అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. ఉదయాన్నే అటువైపు వెళ్లిన కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీసి మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్‌ రెడ్డి తెలిపారు.

మృతిపై అనుమానాలు ఉన్నాయి..

మనోహర్‌స్వామికి గ్రామంలోని కొంతమందికి గొడవలు ఉన్నాయని, ఇటీవల తన కుమారుడిపై దాడి చేశారని మృతుడి తల్లి లక్ష్మి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మనోహర్‌స్వామి చనిపోలేదని శత్రువులే పథకం ప్రకారం తన కుమారుడిని హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని లక్ష్మి వేడుకున్నారు.

విద్యుదాఘాతంతో కూలి..

మహబూబాబాద్‌ రూరల్‌ : విద్యుదాఘాతంతో కూలి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన జంగాల వెంకటేశ్‌ అగ్గిపెట్టెల గిర్ని సమీపంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఇంట్లో పనులు కొనసాగుతున్న సందర్భంగా డ్రిల్లింగ్‌ మిషన్‌ పనికోసం కేసముద్రం మండలం సర్వాపురం తండాకు చెందిన లకావత్‌ బాలరాజు (48) కూలికి వచ్చాడు. అతడు డ్రిల్లింగ్‌ మిషన్‌తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలరాజు మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు టౌన్‌ ఎస్సై ప్రశాంత్‌ బాబు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

ఆటో ఢీకొని కానిస్టేబుల్‌..

వరంగల్‌ క్రైం/కాజీపేట : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సిటీ ఆర్మ్‌డ్‌ విభాగంలో సిటీ గార్డ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకటరెడ్డి (45) మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం కాజీపేట ఫాతిమా జంక్షన్‌ వద్ద వెంకట రెడ్డి తన బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకట్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కాజీపేట సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. వెంకట్‌రెడ్డి మృతి చెందడంతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement