విద్యార్థికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

విద్యార్థికి అస్వస్థత

Mar 11 2026 7:55 AM | Updated on Mar 11 2026 7:55 AM

వాజేడు : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని గాయత్రి మంగళవారం అస్వస్థతకు గురైంది. స్వల్పంగా జ్వరం ఉండటంతో గాయత్రి అలాగే పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్ష రాస్తున్న క్రమంలో నీరసంగా ఉండడంతో అక్కడే ఉన్న 108 సిబ్బంది చికిత్స చేశారు. కోలుకుని తిరిగి పరీక్ష రాసింది.

రూ.84వేల విలువైన

గంజాయి స్వాధీనం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శనిగపురం శివారులో గల ఓ గార్డెన్‌ క్రాస్‌ వద్ద రూ.84వేల విలువైన కిలో 680 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రూరల్‌ సీఐ సర్వయ్య మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్‌ ఎస్సై దీపిక తమ సిబ్బందితో శనిగపురం గ్రామ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారని అన్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి విచారించారు. వారివద్ద కిలో 680 గ్రాముల గంజాయి లభ్యమైందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన యువకులు సోహెల్‌, రాంచరణ్‌ గంజాయిని తీసుకు వెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. మరో యువకుడు క్రాంతికుమార్‌ పరారీలో ఉన్నాడని, ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

‘అంతర్జాతీయ’ వేడుకలకు సర్పంచ్‌ భాగ్యమ్మ

కొత్తగూడ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు కొత్తగూడ సర్పంచ్‌ మల్లెల భాగ్యమ్మకు ఆహ్వానం అందింది. మంగళవారం ఆమె ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.

వృద్ధుడి ఆత్మహత్య

గూడూరు: కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన మండలంలోని చిన్న ఎల్లాపురం శివారు లక్ష్మ ణ్‌తండాలో మంగళవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గుగులోత్‌ బిచ్చ(60) ఖానాపురం మండలం నాజీతండాలో సోమవారం జరిగిన బంధువు దహన కార్యక్రమాలకు వెళ్లి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. దీంతో రాత్రి ఇంట్లో తాడుతో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న యువతి..

డోర్నకల్‌ : మండలంలోని పాతదుబ్బతండాకు చెందిన ఓ యువతి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. డోర్నకల్‌ ఏఎస్సై పాపారావు మంగళవారం తెలిపిన కథనం ప్రకారం తండాకు చెందిన సపావట్‌ నందిని (23) సూర్యాపేటలో బీఈడీ చదువుతోంది. ఇటీవల ఇంటికి రాగా గత ఆదివారం తన తల్లి నాయనమ్మ గొడవ పడుతుండగా మనస్తాపానికి గురైన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. మెరుగైన వైద్యకోసం శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతిచెందింది.

దాడి కేసులో ఒకరి అరెస్ట్‌

నెల్లికుదురు : మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన దాసరి సతీష్‌ అదే గ్రామానికి చెందిన దాసరి నగేష్‌ను గత నెల 11న రాత్రి సమయంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో పాత గొడవలు దృష్టిలో పెట్టకుని కత్తితో దాడి చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్‌ బాబు తెలిపారు. బాధితుడు నగేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు సతీష్‌ను అరెస్టు చేసిమంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement