● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
● వ్యవసాయ పరికరాల పంపిణీ
మహబూబాబాద్ రూరల్: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో రూ.9లక్షల విలువైన సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే మంగళవారం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వినియోగించుకుని పరికరాలను సకాలంలో ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ, సేంద్రియ ఎరువులను వాడి భూమి కాలుష్యాన్ని వారించాలని, ఆయిల్‌పామ్, ఉద్యాన పంటల సాగు లా భదాయకమని, పంట మార్పిడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులకు సబ్సిడీపై 19 బ్యాటరీ స్ప్రేయర్లు, 74 పవర్ స్ప్రేయర్లు, ఒక రోటావేటర్ అందజేశారు. జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


