భోజనం రుచి చూడాలి.. | - | Sakshi
Sakshi News home page

భోజనం రుచి చూడాలి..

Mar 10 2026 12:55 PM | Updated on Mar 10 2026 12:55 PM

హాస్టల్స్‌, గురుకులాల్లో మెనూపై ఆరోపణలు

‘ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ, కేజీబీవీల్లో చదివే పిల్లలకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఎదిగే పిల్లలకు కావాల్సిన మోతాదుల్లో బలవర్థకమైన ఆహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కానీ కొందరు మెనూ పాటించడం లేదు. ఇది నేరం.. జిల్లా అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మండలంలో అధికారికి బాధ్యతలు అప్పగించాలి. వారంలో రెండుసార్లు పిల్లల వద్దకు వెళ్లాలి. అక్కడ పెట్టే భోజనం తినాలి. ఇది జిల్లాలో అమలు చేయాలి’.

– ఇటీవల మహబూబాబాద్‌లో జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

‘ఇటీవల జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ ఆశ్రమ పాఠశాలకు అధికారి తనిఖీకి వస్తున్నారని తెలియగానే.. అక్కడ అంతా అప్రమత్తమయ్యారు. ఈమేరకు డైట్‌ మెనూ ప్రకారం రుచిగా వండి భోజనం పెట్టారు. ఈమేరకు హాస్టల్‌ విద్యార్థులు అబ్బా.. ఈ రోజు భోజనం ఎంత రుచిగా ఉందో.. రోజూ ఓ అధికారి తనిఖీ కోసం వస్తే బాగుండు అని తోటి విద్యార్థులు, తల్లిదండ్రులతో చెప్పడం గమనార్హం.’

సాక్షి, మహబూబాబాద్‌: పేదపిల్లలు చదివే గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో మెనూ అమలు కావడం లేదు. ఉదయం టిఫిన్‌, రాగిజావ, మధ్యాహ్నం అన్నం, ఆకుకూరలు, రసం, పెరుగు, బూస్ట్‌, సాయంత్రం స్నాక్స్‌, గుడ్లు, చికెన్‌, మటన్‌ మొదలైనవి అందించాలి. వీటిని సరఫరా చేసేందుకు టెండర్‌ దారులను ఎంపిక చేశారు. అయితే వీరిలో కొందరు తాము కుదుర్చుకున్న ఒప్పందం పక్కన పెట్టి వాళ్లు పెట్టిందే మెనూగా సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఇటీవల మంత్రి అసహనం వ్యక్తం చేసి.. మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాసిరకం వస్తువుల సరఫరా..

నాసిరకం కిరాణా సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేసిన విషయంపై ఇటీవల ఓ కేజీబీవీ ఎస్‌ఓకు, సదరు కాంట్రాక్టర్‌ మధ్య గొడవ కూడా జరిగినట్లు సమాచారం. ఇక మటన్‌, చికెన్‌ సరఫరా చేస్తున్నవారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, బిల్లులు చేయడంలో అధికారులు అలసత్వంగా ఉండడం, మరికొందరు కమీషన్లు అడిగినట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో బిల్లులు రాకపోవడంతో పలు పాఠశాలల్లో మటన్‌, చికెన్‌ పెట్టడం లేదని, పెట్టినా.. సగానికి కుదించి పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్‌లో ఏ కూరగాయలు తక్కువ ధరకు వస్తే అవే సరఫరా చేయడం, వాటిలో కూడా పుచ్చులు, వాడిపోయినవి ఉంటున్నాయని వంట మనుషులు అంటున్నా .. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని ప్రచారం.

విద్యార్థుల హర్షం..

ఎప్పుడో ఒక రోజు అధికారులు వస్తున్నారంటేనే భోజనం, కూరల్లో మార్పు ఉంటుంది. రుచికరంగా వండుతున్నారు. మంత్రి ఆదేశాలతో వారంలో రెండుసార్లు అధికారులు ఇక్కడే అన్నం తినడం అంటే.. ఇక భోజనం సుచీ, శుభ్రతతోపాటు రుచికి కూడా ఢోకా ఉండదని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడతారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మూణ్నాళ్ల ముచ్చట కాకుండా.. నిరంతర ప్రక్రియగా కొనసాగాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

సరిదిద్దాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

మండలానికో ప్రత్యేకాధికారినియామకం

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

మంత్రి ఆదేశం..

ఇటీవల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆశ్రమ, గురుకులాల విద్యార్థులకు అందించే మెనూపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ పెంచాలని, వారంలో రెండు రోజులు అధికారి అక్కడే భోజనం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారుల ని యామకంతో పాటు, మంత్రి చెప్పిన అంశాల ను ప్రస్తావిస్తూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement