వ్యాధి నివారణే లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

వ్యాధి నివారణే లక్ష్యం!

Mar 10 2026 12:55 PM | Updated on Mar 10 2026 12:55 PM

నేటి నుంచి ఏప్రిల్‌ 9వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

మహబూబాబాద్‌: గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సక్రమిస్తుందని పశువైద్యాధికారులు తెలిపారు. కాగా, వ్యాధి నివారణ కోసం ఈనెల 10నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు టీకాలు వేయనున్నారు. జిల్లాకు 1,50,000 టీకాలు సరఫరా చేయగా.. వాటిని 20 పశువైద్యశాలల్లో నిల్వ చేశారు. నెల రోజుల పాటు టీకాలు చల్లని గదిలోనే ఉంచాలి. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో 45 పశువైద్యశాలలు..

జిల్లాలోని 18 మండలాల్లో మొత్తంగా 45 పశు వైద్యశాలలు ఉన్నాయి. కాగా, తెల్లజాతి పశువులు 1,06 ,000, నల్లజాతి పశువులు 66,000 ఉన్నాయని అధికారులు తెలిపారు. గేదెలు, ఆవులు, ఎద్దులు, మూడు నెలలు దాటిన లేగ దూడలకు గాలికుంటు వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అప్తోస్‌ వైరస్‌ వల్ల పశువులకు సంక్రమిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. వైరస్‌ సంక్రమణ తర్వాత పశువుల్లో నోరు, చిగుళ్లు, కాళ్ల గోళ్ల మధ్య పొక్కుల వల్ల తీవ్రమైన జ్వరం వస్తుంది. చొంగకార్చడం, మేత మేయకపోవడం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి ఆరోగ్యకరమైన పశువులకు గాలి నీరు, మేత ద్వారా, దూడలకు పాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

రైతులపై ఆర్థిక భారం..

గాలికుంటు వ్యాధితో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పశువులు కూడా బలహీనపడుతాయి. చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుంది. కోలుకున్న తర్వాత కూడా పశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతాయి. పశువుల ఉత్పాదక శక్తి క్రమంగా తగ్గి రైతులకు నష్ట జరుగుతుంది.

జిల్లాకు 1,50,000 టీకాలు..

జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. ఈమేరకు 1,50,000 టీకాలు సరఫరా చేశారు. వాటిని జిల్లాలోని 20పశు వైద్యశాలల్లో నిల్వ కేంద్రాల్లో నిల్వ చేశారు. జిల్లాలో 18 మండలాలకు గాను ప్రతీరోజు ఒక మండలంలో 3 బృందాలు పశువులకు టీకాలు వేస్తాయి.

పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

గాలి కుంటు వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. వ్యాధి నివారణకు పాడి రైతులు సహకరించాలి. టీకాల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నెల రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది. రైతులకు ముందుగానే సమాచారం ఇస్తారు. – కిరణ్‌కుమార్‌,

జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి

జిల్లాకు చేరిన 1,50,000వ్యాక్సిన్లు.. 20 పశువైద్యశాలల్లో నిల్వ

1,72,000 నల్ల, తెల్ల జాతి పశువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement