● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు రూరల్: పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని అమ్మాపురం, దుబ్బతండా పంచాయతీ పరిధిలోని భీముడు తండాలో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అమ్మాపురం ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్య, వైద్యం ఇతర సంక్షేమ పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అమ్మాపురంలో దళిత బిడ్డల వసతి నిమిత్తం ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచులు ముద్దం సునీత, ధరావత్ విజయ, హెచ్‌ఎం తుమ్మ వెంకటేశ్వర్లు, సీడీఎఫ్ ప్రతినిధి శ్రీనివాసరావు, నాయకులు పొనుగోటి సోమేశ్వరరావు, ముద్దం మహబూబ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, జాటోతు సురేష్, లింబా తదితరులు పాల్గొన్నారు.


