ముందు చూపు.. | - | Sakshi
Sakshi News home page

ముందు చూపు..

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

డ్రైవర్ల కంటిచూపు కీలకంగా భావించిన పోలీస్‌శాఖ

సాక్షి, మహబూబాబాద్‌: వాహన డ్రైవర్లకు కంటిచూపు చాలా ముఖ్యం. కంటిచూపు సన్నగిల్ల డం, అశ్రద్ధ వహిస్తే రోడ్డు ప్రమదాలకు దారి చూపే అవకాశం ఉంది. ఈమేరకు పోలీస్‌ శాఖ ముందస్తు చర్యల్లో భాగంగా అరైవ్‌.. అలైవ్‌(క్షేమంగా గమ్యస్థానం చేరడం) కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు చేయిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాల మేరకు కంటి చూపు సరిచేసుకో.. క్షేమంగా ఇంటికి చేరుకో అన్న నినాదంతో జిల్లా పోలీసులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

పెరిగిన రోడ్డు ప్రమాదాలు..

జిల్లాలో 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా నమోదయ్యాయి. గతేడాదితో పాటు ఈ సంవత్సరం 121 మంది చొప్పున మరణించారు. అదే విధంగా గత ఏడాది 134 రోడ్డు ప్రమాదాలతో గాయపడిన వారు ఉంటే ఈ ఏడాది 159 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గతేడాది స్వల్పగాయాలతో బయట పడిన ప్రమాదాలు 19ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 37కు చేరింది. అయితే ఇందులో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడినవారు ఎక్కువగా ఉండడం గమనార్హం. వీరితోపాటు కంటి చూపు మందగించడం, ఎదురుగా వచ్చే వాహనాల కాంతి వల్ల ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి.

అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమం..

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటే ప్రమాదాలకు గురికావొద్దు. వీటిని నివారించేందుకు డ్రంకెన్‌ డ్రైవ్‌, హెల్మెట్‌ వాడకం.. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం మొదలైన అంశాలపై అవగాహన కల్పిస్తూనే.. ఈసారి మరో అడుగు ముందుకేసి వాహనాలు నడిపే వారి కంటిచూపుపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కంటి చూపు మందగించిన వారిని గుర్తించి ప్రత్యేక చికిత్స కోసం సిఫారసు చేశారు.

పరీక్షలు ఇలా..

వాహనాలు నడిపే వారికి కంటి చూపు ప్రధానమని భావించిన పోలీసుశాఖ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం రెండు సబ్‌ డివిజన్లు, పది సర్కిళ్లు, 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి విడత తరచూ ప్రమాదాలు జరిగే హైవేలు, జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఇందులో మహబూబాబాద్‌ టౌన్‌, డోర్నకల్‌, కేసముద్రం, గూడూరు, బయ్యారం, మరిపెడ సర్కిల్‌ ప్రాంతాల్లో ఆటో, ట్రాక్టర్‌, లారీ, డీసీఎం, టాటాఏస్‌, బస్సులను నడిపే వారిని ఎంపిక చేశారు. ఇలా మొత్తం 824 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 172మంది డ్రైవర్లు కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. వారికి మెరుగైన చికిత్స, ఇతర వైద్య సలహాల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. కంటి చూపు సరిచేసుకోకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

కంటిచూపు ముఖ్యం..

ఏ పనిచేయాలన్నా కంటి చూపు కీలకం. ప్రతీ వాహనంలో ప్రయాణం చేస్తున్నవారి ప్రాణాలు ఆ వాహనం నడిపే డ్రైవర్‌ చేతిలో ఉంటాయి. అందుకోసం డ్రైవర్లు ఆరోగ్యంగా ఉండాలి. కంటి చూపు సక్రమంగా ఉండాలి. ఈ విషయం కీలకంగా భావించి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడత ఆరు సర్కిళ్ల పరిధిలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందుకు డ్రైవర్ల నుంచి మంచి సహకారం అందింది. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. డ్రైవర్లు కంటి పరీక్ష చేయించుకోవాలి.

– శబరీష్‌, ఎస్పీ

పోలీస్‌శాఖ నిర్వహించిన కంటి పరీక్షల వివరాలు

అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమంలో

కంటి పరీక్షలు

దృష్టిలోపం, ఎదురుగా వచ్చే వాహనాల కాంతితో ఇబ్బంది

చూపు సన్నగిల్లిన వారికి వైద్య సేవలకు సిఫారసు

సర్కిల్‌ పరీక్షించిన కంటి సమస్య

వారి సంఖ్య ఉన్నవారు

మహబూబాబాద్‌ 60 04

డోర్నకల్‌ 66 15

కేసముద్రం 350 128

గూడూరు 28 07

బయ్యారం 250 10

మరిపెడ 70 08

మొత్తం 824 172

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement