నర్సరీల్లో మొక్కల పెంపకం | - | Sakshi
Sakshi News home page

నర్సరీల్లో మొక్కల పెంపకం

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

జిల్లాలో హరితహారం కోసం సిద్ధం

లక్ష్యం మేరకు అందుబాటులో

ఉంచేలా చర్యలు

గూడూరు: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం కోసం విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ఈమేరకు ఏటా వానాకాలంలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పెంచుతోంది. కాగా, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఆర్థికంగా ఉపయోగపడుతూ, ప్రతీ గ్రామ పంచాయతీలో పల్లె నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతను పంచాయతీలకు అప్పగించారు. కాగా రెండు నెలల క్రితం నుంచే నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు మట్టి, ప్లాస్టిక్‌ కవర్లు ఏర్పాటు చేశారు. కొన్ని నర్సరీల్లో మొక్కలు పెరుగుతుండగా, మరికొన్ని చోట్ల అవసరమైన మొక్కలు నాటుతున్నారు.

ఒక్కో నర్సరీలో 6వేల మొక్కలు..

హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే వర్షాకాలంలో నిర్దేశిత లక్ష్యం మేర మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీల్లో 29 లక్షల మొక్కల పెంకమే లక్ష్యంగా నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 6వేల మొక్కలు పెంచే లక్ష్యంతో కవర్లలో విత్తనాలను నాటి సిద్ధం చేశారు. వీటిలో కలప, నీడనిచ్చే మొక్కల పెంపకానికి ప్రాధానత్య ఇస్తున్నారు. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలో 60వేల నుంచి 75వేల మొక్కలు మిగిలి ఉండగా, వాటితో పాటు ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం మేర పెరిగిన మొక్కలను నాటడమే లక్ష్యం ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఎంపీడీఓలు, ఏపీఓలు పర్యవేక్షించాలి

జిల్లా పరిధిలోని నర్సరీల్లో ప్లాస్టిక్‌ కవర్లలో మట్టి నింపి, విత్తనాలు నాటారు. నాణ్యమైన మట్టి, విత్తనాలు ఉపయోగించాం. నర్సరీల నిర్వహణ బాధ్యత జీపీలు చూస్తుండగా, ఎంపీడీఓలు, ఏపీఓలు పర్యవేక్షిస్తారు.

–జి. మధుసూదన్‌రాజు. డీఆర్‌డీఓ

Advertisement
 
Advertisement
Advertisement