● ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే
మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ
● ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మహిళలకు సన్మానం
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పెద్దపీట వేస్తున్నారన్నారు. సమాజంలో మహిళలు సాధించిన విజయాలు, వారి శక్తిని, వారు అందిస్తున్న అద్భుతమైన సహకారాన్ని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక గొప్ప వేదికన్నారు. ఒక మహిళ తల్లిగా, సోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని, నేడు మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా విద్య, వ్యాపారం, సైన్స్, క్రీడలు, రాజకీయాలు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అయినప్పటికీ అనేక చోట్ల మహిళలు అసమానతలు, సవాళ్లను ఎదుర్కొంటున్నారని, నిజమైన అభివృద్ధి జరగాలంటే మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, రక్షణ కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, మహిళా వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.


