మఫ్టీలో షీ టీం బృందాలు | - | Sakshi
Sakshi News home page

మఫ్టీలో షీ టీం బృందాలు

Mar 9 2026 7:10 AM | Updated on Mar 9 2026 7:10 AM

విద్యార్థినులు, మహిళలు అధైర్యపడొద్దు

ఫిర్యాదు రాగానే స్పందిస్తాం..

షీటీం ఎస్సై పెండెల సునంద

మహబూబాబాద్‌ రూరల్‌: పాఠశాలలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తదితర ప్రాంతాల్లో షీ టీం బృందాలు మఫ్టీలో ఉంటారని, విద్యార్థులు, యువతులు, మహిళలు ఎవరైనా సరే వారికి సమస్య వచ్చిందని ఫిర్యాదు చేయగానే స్పందిస్తామని షీ టీం ఎస్సై పెండెల సునంద తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న హత్యలు, వరకట్న వేధింపులు తదితర విషయాలపై శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేసిన వారితో మాట్లాడి వారికి జరిగిన అన్యాయంపై విచారిస్తాం. బాధితులు షీ టీం పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకున్నప్పటికీ ప్రభుత్వం కేటాయించిన వాట్సాప్‌ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు అవతలి వ్యక్తులను పిలిపించి విచారించి చర్యలు తీసుకుంటాం. చాలావరకు కేసులు సామరస్యపూర్వక వాతావరణంలోనే పరిష్కారం అవుతాయి. లేదంటే బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పంపించి కేసులు నమోదు చేయిస్తాం. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తదితర ప్రాంతాల్లో షీ టీం బృందాలు మఫ్టీలో ఉండి ఈవ్‌టీజర్లను పట్టుకునేందుకు చర్యలు చేపడతారు. అనంతరం ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారు మరోసారి తప్పు చేయకుండా చూస్తాం. ఈవ్‌ టీజింగ్‌ పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రస్తుతానికి పోక్సో, గృహహింస ఇతర మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారానికి షీ టీం పోలీసు స్టేషన్‌ పనిచేస్తుంది.

జిల్లాలో మహిళలపై నమోదైన కేసుల వివరాలు

జిల్లా పరిధిలో ఏడాది కాలంగా మహిళలపై జరిగిన నేరాల విషయానికొస్తే 176 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 42 ఈవ్‌టీజింగ్‌ కేసులు, 55 అత్యాచారం కేసులు, 5 వరకట్న హత్యల కేసులు, 9 మహిళల హత్యల కేసులు, 178 అత్యాచార ప్రయత్నం కేసులు నమోదయ్యాయి.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్‌ రఫీ

మహబూబాబాద్‌ రూరల్‌: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్‌ రఫీ కొనియాడారు. జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి షాలిని షాకెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనకు విద్యాబుద్ధులు నేర్పించిన తీరును గుర్తుచేసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్‌ న్యాయవాదులు కమల్‌ కుమార్‌, రాజమణి, మౌనిక, చిన్నమహేందర్‌, మున్నా, శ్రీనివాస్‌, బాలాజీలను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి, న్యాయమూర్తులు స్వాతిమురారి, కృష్ణతేజ్‌, క్రాంతికుమార్‌, డీఎస్పీ తిరుపతిరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement