మహబూబాబాద్ రూరల్: మహిళలు ఆత్మగౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి, ఉత్తర తండా జీపీల పరిధిలో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.10 లక్షల చొప్పున నిధులతో మహిళా సమాఖ్య భవనాలు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, సర్పంచులు చీరిక వసంతఉపేందర్ రెడ్డి, బానోత్ మంగీలాల్, కమటం యాకన్న, బోడ లింగ్యా, తదితరులు పాల్గొన్నారు.
నర్సరీల్లో మొక్కలు పెంచాలి
దంతాలపల్లి: నర్సరీల్లో మొక్కలు పెంచి రానున్న వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శనివారం మండలకేంద్రంలోని శ్మశాన వాటిక, నర్సరీలు పరిశీలించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులతో పాటు ఉపాధి హామీ పనుల రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచి సిద్ధం చేయాలన్నారు. మొక్కల పెంపకంపై సిబ్బందికి సలహాలు, సూచనలు చేశా రు. అనంతరం మండలకేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులచే పాఠాలు చదివించి సామర్థ్యాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. టెన్త్ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎంపీడీఓ విజయ, ఎంపీఓ అప్సర్ పాషా, ఏపీఓ మంగమ్మ, హెచ్‌ఎం వేణుమాధవరెడ్డి పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించరూ..
నెహ్రూసెంటర్: ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రయాణికుల నుంచి వినతులు వచ్చాయని ఆర్టీసీ డిపో మేనేజర్ వి.కల్యా ణి తెలిపారు. శనివారం ఆర్టీసీ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించగా ముల్కలపల్లి టు ఖమ్మం సర్వీసులు పెంచాలని, మరిపెడ బంగ్లాకు బస్సు సర్వీసుల సమయ పాలన మార్చాలని, కురవి మోడల్ స్కూల్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు డీఎం తెలిపారు. మహబూబాబాద్ నుంచి తొర్రూర్‌కు ఎక్స్‌ప్రెస్ సర్వీసు కల్పించాలని, పెద్దవంగరకు కొత్త సర్వీసులు నడిపించాలని ప్రయాణికులు, ప్రజల నుంచి వినతులు వచ్చాయని డీఎం కల్యాణి పేర్కొన్నారు. ఆయా రూట్లను పరిశీలించి బస్సు సర్వీసులు పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు డీఎం స్పష్టం చేశారు.


