‘పది’లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● డీఈఓ రాజేశ్వర్‌రావు
చిన్నగూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని డీఈఓ రాజేశ్వర్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయం, జె డ్పీహెచ్‌ఎస్ జయ్యారం పాఠశాలలను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. పదో తరగతి ప్రీ–ఫైనల్ పరీక్షలను బోర్డు తరహాలో నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. పరీక్షలంటే భయం వీడి ఒక అవకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ బ్లూప్రింట్ ప్రకారం ముఖ్యమైన ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వడం, మోడల్ పేపర్లను సాధన చేయడం వంటి అంశాలు విజయానికి దోహదపడుతాయని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైన నిద్ర, పౌష్టికాహారం తీసుకోవడం పరీక్షల సమయంలో ముఖ్యమని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థి స్పెషల్ టెస్ట్ పరిశీలించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఫలితాల మెరుగుదలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరా రు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అప్పారావు, ఎంఈఓ రవికుమార్, ఉపాధ్యాయులు రెహమాన్, ఉపేందర్, రమేశ్ ఉన్నారు.


