పులకించిన మేడారం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బుధవారం మేడారంలో మండమెలిగె పండుగను పురస్కరించుకుని భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, కానుకులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం లేని మహిళలు కలగాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. సమ్మక్క– సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరగడంతో పోలీసులు భక్తులను క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, తాడ్వాయి, నార్లాపూర్ దారిలోని అటవీ ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. మేడారం అటవీ ప్రాంతమంతా భక్తులతో సందడిగా కనిపించింది.
అమ్మవార్లకు వేలాది మంది భక్తుల మొక్కులు
సమ్మక్క– సారలమ్మ నామస్మరణతో మార్మోగిన గద్దెల ప్రాంగణం
పులకించిన మేడారం
పులకించిన మేడారం


