గుండెపూడిలో ఆదిమానవుల ఆవాసం
● ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్ రెడ్డి వెల్లడి
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో మల్లన్న గుట్ట కేంద్రంగా బృహత్ శిలాయుగ సంస్కృతి వర్ధిల్లిందని డిస్కవరీ మ్యాన్ (పరిశోధకుడు) రెడ్డి రత్నాకర్ రెడ్డి నిర్ధారించారు. కాకతీయుల మూల పురుషుడు ‘కాకర్త్య గుండన’ పుట్టిన ఊరును గుర్తించేందుకు చేస్తున్న పరిశోధనలో భాగంగా బుధవారం స్థానిక రామాలయ అర్చకులు సముద్రాల లక్ష్మీనర్సింహాచార్యులు, గోలి వినయ్‌తో కలిసి గుండెపూడి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మల్లన్న గుట్టపై శిలలను క్షణ్ణంగా పరిశోధించగా ప్రాచీన కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు వెలుగు చూశాయి. మల్లన్న గుట్టపై సుమారు 3 వేల ఏళ్ల కిందటి గుండ్రాతి శిలలపై బరువైన కప్పు బండ అమర్చి ఉన్న నిర్మాణాలను గుర్తించారు. వీటిని ‘డోల్మన్’ రకపు (రాతి గూడు సమాధులు) సమాధులంటారని తెలిపారు. మల్లన్న గుట్ట తక్కువ ఎత్తు, విశాల ఉపరితలం, సులభంగా పైకి చేరుకునేలా ఉండడం, గుట్టకు ఆనుకుని చెరువు, సాగుకు అనువైన భూమి ఉండడంతో ఆదిమానవులు ఈ ప్రాంతాంలో ఆవాసాన్ని ఏర్పరుచుకున్నారని తెలిపారు. డోల్మన్ నిర్మాణం పక్కన శిథిల నర్సింహాస్వామి ఆలయం ఉందని, ఆలయం ఎదుటి భాగంలో ధ్వజస్తంభం ఉందన్నారు. అడుగు భాగం చివరి కొన అంచులు మాత్రమే దిగువన ఉపరితలంపై నిలబెట్టారని, ప్రకృతి విపత్తులకు తట్టుకుని ఇంకా నిలబడి ఉండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గ్రామస్తులు నర్సింహాస్వామి ఆలయం, డోల్మన్ సమాధిని పరిరక్షించుకోవాలని రత్నాకర్‌రెడ్డి కోరారు.


