ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ..
మంగపేట: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల క థనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా తొండాపూర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన పానెం ప్రకాశ్ (28) భార్య నదియ సంక్రాంతికి తన పిల్లలను తీసుకుని ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలోని తన పుట్టింటికి వెళ్లింది. భార్యాపిల్లలను తీసుకొచ్చేందుకు ప్రకాశ్ ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలోని చుంచుపల్లి శివారులో వెంకటాపురం(కె) మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన సోలం అరుణ్‌కుమార్, వాసం నందకిశోర్, మడకం సంజయ్ మంగపేట వైపు నుంచి ఏడూళ్లబయ్యారం వెళ్తూ రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న ప్రకాశ్ బైక్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు యువకులు అరుణ్‌కుమార్, నందకిశోర్‌కు గాయాలు కావడంతో స్థానికులు 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి మృతి, ఇద్దరికి గాయాలు
చంచుపల్లి సమీపంలో ఘటన
మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి


