పాఠాలు చెప్పేది ఎవరు ?
● ఉపాధ్యాయులకు జీపీ ఎన్నికల డ్యూటీలు
● విద్యార్థులకు విద్యాబోధనలో నిర్లక్ష్యం
● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
మహబూబాబాద్ అర్బన్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడత పోలింగ్ ముగియగా.. మరోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు, వేలం పాటలతో సర్పంచ్‌లు ఖరారు కాగా, మిగిలిన గ్రామాల్లో ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. కాగా, మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ డ్యూటీ పడడంతో పిల్లలకు పాఠాలు బోధించేవారు లేకపోవడంతో పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 676 ప్రైమరీ స్కూల్స్..
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతంలో ఆయా పాఠశాలలకు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ లేని మండలాల పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీ పడ్డాయి. అక్కడ పాఠశాలలు యథావిధిగా కొనసాగాలి. కాగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికల డ్యూటీలు పడడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు కరువయ్యారు. జిల్లాలో 676 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉన్నాయి. ఇందులో సుమారు 1350 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసారి ఉపాధ్యాయులకే కాకుండా సీఆర్పీలకు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. దీంతో జిల్లాలో ఏ పాఠశాలకు, ఏ కార్యాలయానికి వెళ్లిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చొరవ తీసుకొని, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు హై స్కూల్ ఉపాధ్యాయులు పంపి పిల్లలకు బోధించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
‘పై ఫొటోలో కనిపిస్తున్నది మానుకోట పట్టణం పత్తిపాకలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఒక మహిళా హెచ్‌ఎం, ఒక ఉపాధ్యాయురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. సుమా రు 50మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా టీచర్లకు మూడో విడత ఎన్నికల డ్యూటీ పడడంతో పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించాల్సి దుస్థితి నెలకొంది. మండల విద్యాధికారికి సమాచారం అందించగా పిల్లలను చూసుకోవాల్సిందిగా వంట నిర్వాహకులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఒకరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తే విద్యార్థులకు పాఠాలు బోధిస్తామని ఉపాధ్యాయురాలు తెలిపారు.’


