పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్ పోలీసులు సోమవారం రాత్రి వేళ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. స్థానిక సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, గొల్లచర్ల, హూన్యాతండా తదితర గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం చూపుతూ గొడవలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు జి.దేవేందర్, కొత్త నాగయ్య అన్నారు. మానుకోట డిపో డ్రైవర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన వెల్లడించారు. ఆర్టీసీ డిపో సెక్యూరిటీ, సిబ్బందిని నియమించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.
‘ముఖ గుర్తింపు’తో
సమయపాలన
కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్‌వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు.
ఆర్ట్స్, సైన్స్ కళాశాల
ఎంఓయూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్‌కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్‌తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్‌మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కోల్‌కత్తా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు.
నవ్వు పార్టీ మారుకుంటూ వస్తున్నావు..
కురవి: పార్టీలు మారుకుంటూ వస్తున్నావు.. ఇప్పుడు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా నిలిచావు అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీరోలు మండలం చింతపల్లిలో రాంచంద్రునాయక్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామ శివారు కొత్త తండాకు దారి సమస్య మాట్లాడేందుకు ఎమ్మెల్యే నడిచి వెళ్లారు. అక్కడ వేచి ఉన్న కొత్త తండా వాసులతో మాట్లాడే సమయంలో రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రంగన్నకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలు మారుకుంటూ వస్తున్నావు అంటూ రెబల్ అభ్యర్థి రంగన్నపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రంగన్న సైతం ఆయనతో వాదనకు దిగాడు. తనను ఎమ్మెల్యే దుర్భాషలాడినట్లు రంగన్న ఆరోపించాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో రంగన్నను దుర్భాషలాడినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పోలీసుల ఫ్లాగ్‌మార్చ్


