వరిసాగుపై మక్కువ
● యాసంగి పంటపై రైతన్నల చూపు
● పెరిగిన భూగర్భ జలాలు,
నిండిన చెరువులు, కుంటలపై ఆశలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు వరిపంట సాగువైపే అధికంగా మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వానాకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చే రింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి రెండో పంట వరి సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించి, సాగుకు సన్నద్ధమవుతున్నారు.
నార్లు పోయడం..
గతంతో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు చేపట్టేందుకు రైతులు యాసంగి పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు వరినార్లు పోశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు పెరిగి వరి సాగు చేస్తే, ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం, ఎస్సారెస్పీ జలాలు రానుండడంతో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.
సాగుపై అంచనా..
జిల్లాలో గత ఏడాది యాసంగిలో 1,49,353 ఎకరాల్లో వరిసాగు చేయగా.. ప్రస్తుతం రైతులు 1,64,124 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే వానాకాలం పంటలు సాగు పూర్తికాగా , యాసంగి పంటల సాగు పనులు మొదలుపెట్టారు. పలుచోట్ల మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు.
వరిసాగుపై మక్కువ


