● పుట్టిన పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
● ఈనెల 15 నుంచి 21వరకు నవజాత శిశువు వారోత్సవాలు
● ప్రసూతి సమయంలో జాగ్రత్తలపై అవగాహన
● మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లోనే కీలకం
సాక్షి, మహబూబాబాద్: బిడ్డ పుట్టిన రెండు వారాల వరకు నవజాత శిశువుగా పరిగణిస్తారు. ఈ సమయం శిశువు ఆరోగ్య పరిస్థితి ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ సమయంలో వచ్చే చిన్నచిన్న సమస్యలతో పాటు ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రక్రియ శిశుమరణాల రేటు తగ్గించేందుకు కూడా దోహదపడుతోంది.
ఆరోగ్యం కీలకం..
నవమాసాలు తల్లిగర్భంలో ఉన్న శిశువు జన్మించగానే బాహ్య ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు సర్దుబాటు చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా పరిపక్వత కాకుండా జననం, ఊపిరితిత్తుల సమస్య, శ్వాస పీల్చడం కష్టం, ఫిట్స్, కామెర్లు, న్యూమోనియా, బరువు తక్కువ, గుండె, పుర్రె భాగంలో లోపాలు మొదలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమయంలో డాక్టర్లు తీసుకునే జాగ్రత్తలు, అందించే చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో మాతా శిశు సంక్షరణ కేంద్రాల ద్వారా తల్లీ బిడ్డకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
ఐదో వంతు శిశువులకు చికిత్స
మహబూబాబాద్ జిల్లాలో గత ఆరు నెలల్లో 5,014మంది పిల్లలు జన్మించారు. ఇందులో 1,204 సాధారణ డెలివరీలు కాగా.. 3,546 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,481 ప్రసవాలు కాగా.. 973 సాధారణ, 1,508 సిజేరియన్ డెలివరీలు జరిగాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 231 మాత్రమే సాధారణ ప్రసవాలు కాగా.. 2,038 సిజేరియన్ ప్రసవాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతు న్నాయి. అయితే పుట్టిన బిడ్డల్లో ఒకశాతం అంటే ప్రతీ వెయ్యి మందిలో పదిమంది వివిధ కారణాలతో మృతి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా పుట్టిన బిడ్డల్లో ఐదోవంతు నవజాత శిశువులు చిన్నచిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ప్రధానంగా బరువు తక్కువతో జననం, కామెర్లు, శ్వాసకోస సమస్య, ఫిట్స్, పరిపక్వత లేకపోవడం, బరువు తక్కువ, న్యూమోనియా తదితర సమస్యలు ఉంటున్నాయి. ఇలా ఒక్క మహబూబాబాద్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనే నెలకు వందకుపైగా నవజాత శిశువులకు చికిత్స అందుతోంది.
నవజాత శిశువు వారోత్సవాలు
చిన్నతనంలో వచ్చే సమస్యను సరిదిద్దకపోతే పెద్ద పెరిగిన తర్వాత మానని గాయంగా మారుతుంది. అందుకోసమే నవజాత శిశువు ఆరోగ్యంపై జాతీయ వైద్యారోగ్యశాఖ, మాతా శిశుసంక్షేమశాఖ ప్రత్యేక శ్రద్ధపెట్టాయి. ఇందులో భాగంగా నవంబర్ 15 నుంచి 21వ తేదీ వరకు నవజాత శిశువు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి సమయంలో పాటించే శుభ్రత, వినియోగించే పరికరాలు, బొడ్డుతాడు కటింగ్, ఉమ్మునీరు తీయడం, శుభ్రం చేయడం, పుట్టిన వెంటనే పిల్లల డాక్టర్‌కు చూపించడం, అవసరమైన చికిత్స అందించడం మొదలైన అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని డాక్టర్లు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం, గర్భిణులకు, బాలింతలకు తల్లీ, బిడ్డ ఆరోగ్య సూత్రాలు వివరించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
పసిబిడ్డ పదిలం!
పసిబిడ్డ పదిలం!


