నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దు
తొర్రూరు: నిబంధనలు ఉల్లఘించి వాహనాలు నడిపితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణ శివారులో సోమవారం రవాణా శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అధిక లోడుతో ప్రయాణిస్తులు లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. లెసెన్స్‌లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను పరిశీలించారు. అధికారి మాట్లాడుతూ.. అధిక వేగంతో, ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
అగ్ని ప్రమాదాలపై
అవగాహన అవసరం
డోర్నకల్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనాథ్ కోరారు. స్థానిక అగ్నిమాపక కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలిమంటల ఏర్పాటు, ఇళ్ల ముందు చెత్తను కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలిమంటలను ఇళ్లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని, మంటలకు దూరంగా ఉండాలని కోరారు. అమ్మపాలెం రైతు వేదిక సమీపంలో అగ్నిమాపక కేంద్రాన్ని సంవత్సరంలోగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు జరిగినా తమ సిబ్బందికి సకాలంలో సమాచారం అందించాలని కోరా రు. కార్యక్రమంలో ఎస్సై వీరేశం, సిబ్బంది పాల్గొన్నారు.
వసతిగృహం తనిఖీ
బయ్యారం : కలెక్టర్ ఆదేశాల మేరకు బయ్యారంలోని ఎస్సీ వసతిగృహాన్ని సోమవారం సాయంత్రం తహసీల్దార్ నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతిగృహం పరిసరాలను పరిశీలించి విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహం సంక్షేమాధికారితో మాట్లాడుతూ... అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించడంతో పాటు విద్యార్థులకు వేడివేడి ఆహారాలను అందించాలన్నారు.
మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి
మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం చాటుకున్నారు. ఆమె సోమవారం కురవి మండల కేంద్రానికి వెళ్తుండగా అదే సమయంలో మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న తండ్రీకొడుకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సత్యవతి రాథోడ్, ఆమె సిబ్బంది గాయపడిన క్షతగాత్రుల వద్ద్దకు వచ్చి మంచినీళ్లు ఇచ్చారు. సత్యవతిరాథోడ్ గాయాలైన బాలుడి మొహం స్వయంగా కడిగి, అంబులెన్స్ ఎక్కించి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు గడువును ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ దక్షిణామూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి ఫీజు రూ.125 చెల్లించాలన్నారు. ఈనెల 21నుంచి 29వ తేదీ వరకు రూ.50 అపరాద రుసుముతో చెల్లించాలని, డిసెంబర్ 2నుంచి 11వ తేదీ వరకు రూ.200, డిసెంబర్ 15నుంచి 29 వరకు రూ.500 అపరాద రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ శ్రీరాములు 98497 61012 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దు
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దు
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దు


