మరమ్మతులు మరిచారు!
● వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు
● గుంతలతో ప్రమాదకరంగా దారులు
● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కొత్తగూడ: వర్షాలతో ఏజెన్సీలోని రోడ్లు దెబ్బ తిన్నాయి. గుంతలు పడిన రోడ్లపై వెళ్లాలంటేనే ప్ర యాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.
నర్సంపేట టు కొత్తగూడ రోడ్డు..
నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారి చిలకమ్మనగర్‌లో బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. గాంధీనగర్ సమీపంలో గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కొత్తగూడ నుంచి ఇల్లెందు వైపునకు వెళ్లే ప్రధాన రహదారి కిష్టాపురం క్రాస్ రోడ్డు, పోలారం సమీపంలోని మూలమలుపు వద్ద గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రం సమీపంలో రాళ్లతెట్టెవాగు వద్ద రోడ్డు పూర్తిగా కోతకు గురై ప్ర మాదకరంగా మారింది. దెబ్బతిన్న రోడ్లకు కనీ సం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్ల నిర్వహణను ఆర్‌అండ్‌బీ అధి కారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
నిర్వహణ శూన్యం..
వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు శాఖాపరమైన నిర్వహణ కరువైందని స్థానికులు అంటున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో గ్యాంగ్ మెన్‌లు ఉండి రోడ్డుకు ఇరువైపులా నీరు నిల్వకుండా చూసేవారు. ప్రస్తుతం వారు కనుమరుగయ్యారు. దీంతో వర్షాకాలంలో రోడ్డు పక్కన నీరు నిలిచి వాహనాల రాకపోకలతో రోడ్లు క్రమంగా దెబ్బ తింటున్నాయి. కోట్లు వెచ్చించి రోడ్లు వేసిన అనతికాలంలోనే ధ్వంసం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. గ్యాంగ్ మెన్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించడంతో పాటు రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరమ్మతులు మరిచారు!


