ఉపకార వేతనాలు విడుదల చేయాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో చదువుకోడానికి నిధులు లేక విద్యార్థులు భిక్షాటన చేయాల్సి దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉపకార వేతనాలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు భాష పవన్, గుండ్ల రాకేష్, పట్టణ నాయకులు తాజ్, వీరేందర్, మహేశ్, యాకన్న, సాగర్, మహేశ్, ప్రవీణ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
