మరింత ‘సహకారం’..
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహకార బ్యాంకు సేవలను మరింత విస్తరించేందుకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు (సీసీ బ్యాంకు) ప్రణాళికలను రూపొందించింది. జనగామ జిల్లాలోని దేవరుప్పుల సింగిల్ విండో కార్యాలయ పరిధితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడు కొత్త బ్యాంకు శాఖలను ప్రారంభించేందుకు కేంద్ర సహకార బ్యాంకు ఏర్పాట్లు చేస్తోంది. సహకార బ్యాంకు సేవలను మరింత విస్తృత పరిచే క్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీసీ బ్యాంకు రెండేళ్లుగా వీటి ప్రారంభానికి కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి స్థానికంగా బ్యాంకు సేవలను అందిస్తున్న నిపుణులతో అధ్యయనం సైతం చేసింది. ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న బ్యాంకులు పౌరులకు ఎలా సేవలందిస్తున్నారనే విషయమై ఆరా తీయడంతో కొత్తగా ఏర్పాటు చే యబోయే శాఖల్లో ఖాతాదారులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయబోయే శాఖలు దేవరుప్పుల, రఘునాథపల్లి (జనగామ జిల్లా), హసన్‌పర్తి (హనుమకొండ), సంగెం (వరంగల్), నెల్లికుదురు, కురవి (మహబూబాబాద్), మొగుళ్లపల్లి (జయశంకర్ భూపాపల్లి జిల్లా)లో వీటిని ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. నూతన బ్యాంకు శాఖలకు సొంత భవనం నిర్మాణం చేసే వరకు ప్రస్తుతం అద్దె భవనాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో కనీసం 15 వందల చదరపు అడుగుల నిర్మాణం ఉన్న భవనాల కోసం దరఖాస్తులను కోరుతున్నారు.
ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు
పొదుపులు..
సహకార సంఘాల్లో ఎరువుల విక్రయంతోపాటు వివిధ పంట రుణాలు అందిస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పొదుపులు, దీర్ఘకాలిక పొదుపు ఖాతాలను నిర్వహించనున్నారు. దేవరుప్పులలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖ అందుబాటులో ఉన్నప్పటికీ, తమ శాఖ ద్వారా మరింత సేవలు అందించొచ్చనే భావనను సీసీ బ్యాంకు యోచి స్తుంది. బ్యాంకు ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంతృప్తిపరిచే నిబంధలున్నా భవనాలను గుర్తించే క్రమంలో బ్యాంకు అధికారులు యజమానులను సంప్రదిస్తున్నారు. వీలైనంత త్వరలో వీటిని ప్రారంభించాలని అధికారులు సంకల్పించారు.
ఏడు సీసీ బ్యాంకు శాఖల ప్రారంభానికి సన్నాహాలు
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న
సహకార సేవలు


