
పాల బిల్లు తీసుకురావడానికి వెళ్తూ..మృత్యుఒడికి
బచ్చన్నపేట : పాల బిల్లు తీసుకురావడానికి వెళ్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన ఈదులకంటి రమేశ్‌రెడ్డి గ్రామంలో జెర్సీ పాల డెయిరీని నిర్వహిస్తున్నాడు. ప్రతీ రోజు గ్రామంలో పలువురు పాల ఉత్పత్తి దారుల వద్ద పాలు కొనుగోలు చేస్తాడు. ఈ క్రమంలో బుధవారం పాల బిల్లు కోసం వెళ్తూ అదే గ్రామానికి చెందిన నల్ల వసంత, చంద్రారెడ్డి దంపతుల కుమారుడు నల్ల రాజేందర్‌రెడ్డి (23)ని బైక్‌పై తీసుకుని వెళ్లాడు. బచ్చన్నపేట నుంచి ఆలేరు వైపునకు వెళ్తుండగా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సమీపంలో ఓ ఫంక్షన్ హాల్ మలుపు వద్ద ఎదురుగా బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న రాజేందర్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ నడుపుతున్న రమేశ్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మృతుడు ప్రస్తుతం ఘట్‌కేసర్‌లో బీఫార్మసీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురెదురుగా ఢీకొన్న బైక్, లారీ.. యువకుడి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు