
మీ వాహనానికి బీమా ఉందా?
ఖిలా వరంగల్ : రోడ్డుపై వాహనం తిరగాలంటే కచ్చితంగా బీమా ఉండాల్సిందే.. కానీ, ఇటీవలి నివేదికల ప్రకారం చూస్తే.. అధిక శాతం వాహనాలకు ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలకు బీమా పాలసీ ఉండడమే లేదు. వాహనం విడుదలైన మొదటిసారి తీసుకుంటున్నారు. తర్వాత బీమా రెన్యువల్ చేయడం మర్చిపోతున్నారు. కాగా, బీమా లేకుండా రోడ్డు పైకి వచ్చే వాహనాలకు జరిమానాలు విధించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలను ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే ఆర్టీఏ, పోలీస్ అధికారులు ఇది పక్కాగా అమలు చేస్తున్నా, ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నాయి. ఈనేపథ్యంలో మీ వాహనానికి బీమా ఉందా లేదా ఒకసారి పరిశీలించండి.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన మోటారు
వాహనాల వినియోగం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోటారు వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రమాదాలూ అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఈసందర్భాల్లో వాహనం దెబ్బతినడం, వాహనదారుడికి గాయాలు కావడం, కొన్నిసార్లు మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. దీంతోపాటు ప్రమాదంలో ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు మోటారు వాహన బీమా కూడా ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనానికి కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పని సరి. ఇది లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడం నేరం. లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్, బీమా, ఇతర అవసరమైన పత్రాలు లేకుండా వాహనం రోడ్డుపైకి తీసుకురావొద్దు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5లక్షలకు
పైగా వాహనాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల సంఖ్య మొత్తం 5లక్షలకు పైగా ఉండగా.. వరంగల్ జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వాహనాలు మొత్తం 2.32లక్షలు ఉన్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలు 1,79,877 కాగా 25,697 కార్లు ఉన్నాయి. అగ్రగామిగా ఉన్న బైక్‌లు, ఆటోలు రోడ్డు ఎక్కితే తప్పని సరిగా వాహన బీమా, ధ్రువీకరణ పత్రాలు వెంట ఉండేలా చూసుకోవాలని ఆర్టీఏ అధికారులు పదేపదే చెబుతున్నారు.
థర్డ్‌పార్టీ బీమాతో రక్షణ..
వాహనం ద్వారా మూడో పక్షానికి (థర్డ్‌పార్టీ.. వాహనం, వాహనాన్ని నడిపే వ్యక్తి కాకుండా ఇతరులు) ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేది థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్. దీనిని లయబిలిటీ ఓన్లీ పాలసీగానూ పిలుస్తారు. విస్తృత బీమా ప్ర యోజనాన్ని కల్పించేది సమగ్ర ద్విచక్రవాహన బీ మా. ప్రమాదం, చోరీ, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, తదితర వాటి వల్ల నష్టానికి పరిహారం ఇవ్వడంతోపాటు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది. సమగ్ర బీమా పాలసీకి కొన్ని అనుబంధ పాలసీలనూ జోడించుకునే అవకాశం ఉంది. వీటిని రైడర్లుగా పిలుస్తారు.
సున్నా తరుగుదల..
ద్విచక్రవాహన బీమా పాలసీలో ముఖ్యమైన రైడర్లలో ఇదొక్కటి. ప్రమాదంలో దెబ్బతిన్న భాగాల విలువకు సమాన మొత్తాన్ని అందుకుంటారు. ఈ యాడ్– అన్‌లేక పోతే ప్రతీ భాగంపై తరుగుదల లెక్కించి, ఆమేరకు బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని చేతి నుంచి భరించాల్సి వస్తుంది.
ఇంజిన్‌కు రక్షణ ..
ఇంజిన్ అంతర్గత భాగాలు దెబ్బతిన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. వరదల్లో వాహనం చిక్కుకున్నప్పుడు ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అనుబంధ పాలసీ ఉపయోగపడుతుంది. టైర్లకు నష్టం వాటిల్లినప్పుడు టైర్ ప్రొటెక్ట్ పాలసీ సైతం అందుబాటులో ఉంటుంది.
వాహనం ఆగితే సాయం..
ప్రమాదం లేదా వాహనం మరమ్మతుకు గురవడం లాంటి సందర్భాల్లో వాహనం రోడ్డుపైనే ఆగిపోతుంది. అలాంటప్పుడు సాయం చేసేందుకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ రైడర్ ఉపయోగపడుతుంది.
నట్లు, బోల్టులకూ..
వాహనం పాడైన సందర్భంలో నట్లు, బోల్టులు, ఇంజిన్ ఆయిల్ లాంటి వాటి కోసం చేసిన ఖర్చులనూ తిరిగి పొందేందుకు కన్జ్యూబుల్ యాడ్– ఆన్ పాలసీ తీసుకోవచ్చు.
థర్డ్‌పార్టీ పాలసీతోనే రక్షణ
పత్రాలు లేకుండా రోడ్డుపైకి చేరితే నేరం
వాహనానికి ఇన్సూరెన్స్ తప్పని సరి
వాహనం వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
వాహనం ఎంత సురక్షితంగా నడిపినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలకు ఆర్థికంగా సన్నద్ధం కావడం ముఖ్యం.అదే సమయంలో చట్టపరమైన బాధ్యతనూ నెరవేర్చడంలోనూ బీమా పాలసీ తోడ్పడుతుంది. అందుకే మీ వాహనానికి ఎప్పుడూ సమగ్ర బీమా పాలసీ ఉండేలా చూసుకోండి. రోడ్డు మీద ధీమాగా ప్రయాణించండి. వాహనం వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం.
సురేశ్‌రెడ్డి, డీటీసీ వరంగల్, హనుమకొండ

మీ వాహనానికి బీమా ఉందా?