
భిక్షాటన పేరుతో సాధువుల మోసం
స్టేషన్‌ఘన్‌పూర్: భిక్షాటనకు వచ్చి వ్యాపారులను మోసం చేసేందుకు యత్నించిన దొంగ సాధువులను స్థానిక వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బుధవారం జరిగింది. వ్యాపారుల కథనం ప్రకారం.. శాంతిపూజలు చేస్తాం, తాయత్తులు అందిస్తాం అంటూ ఓ నలుగురు దొంగబాబాలు సాధువుల వేషధారణలో స్థానిక రైల్వేగేటు సమీపాన ఉన్న పలు షాపుల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయుమాత బ్యాంగిల్ స్టోర్‌లోకి వెళ్లిన ఓ దొంగ సాధువు షాపు యజమానురాలు తారాదేవిని మాటల్లోకి దించాడు. మీకు శాంతి పూజ చేస్తానని మొదట రూ.500 ఇవ్వమని అడిగాడు. మాట్లాడుతూ ఆమైపె ఒక పౌడర్ చల్లాడు. అనంతరం ఆమె ఆ దొంగస్వామి చెప్పినట్లు వింటూ మరో రూ.500 నోటు, అనంతరం మరో రూ.500 ఇస్తుండడాన్ని గమనించిన షాపు యజమానురాలి తమ్ముడు వెంటనే చుట్టుపక్కల వ్యాపారులకు సమాచారం అందించాడు. అందరూ ఒక్కసారి వచ్చి ఏమిటి సంగతని అడుగుడుతుండగా వెంటనే అక్కడి నుంచి ఉడాయించిన సదరు బాబా రోడ్డుపై ఆపి ఉన్న కారులోకి ఎక్కాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారులు కారును అడ్డగించారు. కారులో దొంగ సాధువుతో పాటు మరోముగ్గురు సాధువేషధారణలో ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై పోలీసులకు సంప్రదించగా ఇలాంటి దొంగ సాధువులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, మూఢ విశ్వాసాలతో మోసపోవద్దని సూచించారు. కాగా దొంగ సాధువుల నుంచి రూ.1,500 నగదును తిరిగి బాధితురాలికి అప్పగించారు.
పోలీసులకు అప్పగించిన వ్యాపారులు
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన