జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?

Oct 22 2025 9:14 AM | Updated on Oct 22 2025 9:14 AM

జాతర

జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?

ఎస్‌ఎస్‌తాడ్వాయి: అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తిచేయడంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులపై మంత్రులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క స్వయంగా మేడారాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ విస్తరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం పనులు సాగుతున్నాయనే తప్ప తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి పనులు ఇంకా ప్రారంభం కాని పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి హడావుడిగా పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

వరి కోతలపై ఆధారపడి ఏర్పాట్లు!

పనులకు అవసరమైన భూములు ఇప్పటికే వరిసాగులో ఉండటంతో తాత్కాలికంగా వసతులు, తాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్‌ స్థలాలు జీఐ షీట్స్‌ మరుగుదొడ్ల నిర్మాణం వంటి కీలక పనులకు ఆటంకం కలగనుంది. పనుల కోసం అవసరమైన భూముల్లో సాగు చేసిన వరిపంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ పనులు పూర్తయితేనే ముందుకు సాగే పరిస్థితి ఉంది. ఈసారి భారీ వరదల కారణంగా మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లోని వరినాట్లు వేయడం ఆలస్యమైంది. మహాజాతర వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో జరగనుండడంతో సంక్రాంతి పండుగ నాటికి కూడా వరి కోతలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వరి కోతలు పూర్తయినా భూములు పదునుగా ఉంటే పార్కింగ్‌ స్థలాల ఏర్పాట్ల పనులకు ఆటంకం ఎదురుకానుంది. అనంతరం మిగిలే సమయంలో అన్ని పనులను పూర్తి చేయడం సవాల్‌గా మారనుంది.

తాగునీటి ఏర్పాట్లు కీలకం

మేడారం జాతరలో తాగునీటి ఏర్పాట్లు కీలకం కానుంది. వరి కోతలు పూర్తయ్యే వరకు తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, మొదలయ్యే స్ధితిలో కూడా లేవు. తాగునీటి పనుల ఏర్పాట్లకు అవకాశం అధికారులు ఊసేలేదు. అంతేకాకుండా తాగునీటి పైపులైన్‌లు కూడా రైతుల భూముల్లో నుంచి ఏర్పాటు చేసి బ్యాటరీ ఆప్‌ ట్యాబ్‌లకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. ఈపనులు కూడా వరి కోతలు అయిన తర్వాతే మొదలు కానున్నాయి.

మరుగుదొడ్ల పనుల ఊసేలేదు..

జాతరలో భక్తుల సౌకర్యార్థం కోసం వేల సంఖ్యలో తాత్కాలికంగా జీఐ షీట్స్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల పనులకు గత కొద్ది రోజుల క్రితం టెండర్లు కూడా పూర్తయ్యాయి. వరి సాగులో ఉండటంతో మరుగుదొడ్ల ఏర్పాట్ల పనులు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్‌ వైంజక్షన్‌, చిలకలగుట్ట, కొంగల మడుగు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలి. లేదంటే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు అసౌకర్యానికి గురికాక తప్పదు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి..

మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతోంది. అమ్మవార్ల గద్దెల విస్తరణ పునర్నిర్మాణం పనులు మాత్రమే మొదలయ్యాయి. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల పనులు ప్రారంభం కాలేదు. ఈసారి జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనాలకు తగినట్లుగా అభివృద్ధి పనులు చేయాలి. భక్తులు అసౌకర్యాలకు గురికాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.

– సిద్ధబోయిన స్వామి,

సమ్మక్క పూజారి, మేడారం

సమీపిస్తున్న మేడారం మహాజాతర

గద్దెల పునర్నిర్మాణం పనులు మినహా మొదలు కాని జాతర పనులు

మంత్రులు ఆదేశించినా

మారని అధికారులు తీరు

జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?1
1/1

జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement