
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
● జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా పోలీసు ఫ్లాగ్ డే
మహబూబాబాద్ రూరల్ : ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్తూపానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలవేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడుతుందన్నారు. పోలీసు అమరుల ప్రాణత్యాగాల వల్ల నేడు ప్రజలంతా సంతోషంగా ఉండగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరేలా చేయడం, వారి కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపడం పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, గండ్రతి మోహన్, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, సీఐలు, ఆర్‌ఐలు ఎస్సైలు, డీపీఓ అధికారులు పాల్గొన్నారు.

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి