
కోతులతో పరేషాన్
● ఇళ్లు, పంటల ధ్వంసం
● బెంబేలెత్తుతున్న జనం
కురవి: కురవి, సీరోలు మండలాల్లోని అనేక గ్రామాల్లో కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందలాది కోతులు(వానరాలు) నానా విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రజలు కొత్తరకం సమస్యతో సతమతమవుతున్నారు. కోతులను పట్టించాలనే డిమాండ్ ఊరూర పెరుగుతోంది. కోతులతో ఇళ్లల్లో ఉండలేని దుస్థితి నెలకొంది. కురవి మండల కేంద్రంలో వీరన్న సన్నిధి, సంత ఉండడంతో కోతులు విపరీతంగా ఉన్నాయి. వందలాది కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు కరవడం వల్ల అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. జనం ఇళ్లలో వంటలు వండుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఏటేటా కోతులు పెరిగిపోతుండడంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజలకు తోడు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి చేతికొచ్చిన పత్తి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రోజంతా పొలాలు, చేలల్లో రైతులు కాపాలా ఉన్నా పంటలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు కోతులను పట్టించాలని ఊరూర డిమాండ్ ఎక్కువ అవుతోంది. కోతులను పట్టిస్తేనే బతికే అవకాశం ఉందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఊరూర కోతులను పట్టిస్తేనే ఎన్నికల్లో ఓట్లేసే పరిస్థితికి రాబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోతులతో పరేషాన్