తొర్రూరు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త తరలించే వాహనాల నిర్వహణ అధికారుల నిర్లక్ష్యంతో గాడితప్పింది. మరమ్మతులకు గురైన ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు గ్యారేజీకే పరిమితం అవుతున్నాయి. పట్టణాల్లోని ఆవాసాల నుంచి నిత్యం చెత్తను సేకరించే వాహనాలు మరమ్మతులకు గురైనా మున్సిపాలిటీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మరమ్మతులకు గురైన ఆటోలను మెకానిక్ షెడ్లకు పంపించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో రెండు చిన్న వార్డులకు ఒకటి చొప్పున, పెద్ద వార్డుల్లో ఒకటి చొప్పున చెత్త ట్రాక్టర్లను తిప్పుతున్నారు. వాహనాల కొరత కారణంగా పలు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్త సేకరణకు వస్తున్నారు.
ఐదు మున్సిపాలిటీలు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబాబాద్‌లో 36 వార్డులు ఉండగా 143 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. 33 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. తొర్రూరులో 16 వార్డులు, 60 మంది పారిశుద్ధ్య కార్మికులు 12 టన్నుల చెత్త, డోర్నకల్‌లో 15 వార్డులు, 30 మంది కార్మికులు, 3 టన్నుల చెత్త, మరిపెడలో 15 వార్డులు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులు, 3 టన్నుల చెత్త, కేసముద్రంలో 16 వార్డులు, 60 మంది కార్మికులు, 16 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఐదు మున్సిపాలిటీల్లో సరిపడా వాహనాలు లేక చెత్త సేకరణ ప్రహసనంగా మారుతోంది. ఉన్న వాహనాలు మరమ్మతులకు గురవుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఐదేళ్ల క్రితం కొనుగోలు..
జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాలను ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. వీటి నిర్వహణ సక్రమంగా లేక తరచూ మొరాయిస్తున్నాయి. మూలకు చేరిన ఆటోలు నెలల తరబడి మరమ్మతుల షెడ్డులోనే ఉంటున్నాయి. కొన్ని వాహనాలు తుప్పు పడుతున్నాయి. ఆయా వాహనాలు నడిపేందుకు ప్రత్యేకంగా డ్రైవర్లు లేరు. పారిశుద్ధ్య సిబ్బందిలో డ్రైవింగ్ వచ్చిన కొందరు వాటిని నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు నిర్వహణ చేపట్టకపోవడంతో అవి మూలకు చేరుతున్నాయి. చెత్త సేకరణ సమయంలో ఎక్కడ నిలిచిపోతాయో అని భయపడాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బంది పేర్కొంటున్నారు. పాత వాటికి మరమ్మతులతో పాటు కొత్తగా వాహనాల కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
క్రమం తప్పకుండా సేకరణ
చెత్త సేకరించే ఆటోలు కొన్ని మరమ్మతుకు గురైనప్పటికీ సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. మరమ్మతుకు గురైన వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లో వేయాలి. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
–వి.శ్యాంసుందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్
జిల్లాలో మున్సిపాలిటీల వారీగా వాహనాలు
మున్సిపాలిటీ వార్డులు ఆటో రిక్షాలు ట్రాక్టర్లు మరమ్మతులు
మహబూబాబాద్ 36 33 10 5
తొర్రూరు 16 6 4 2
డోర్నకల్ 15 3 3 3
కేసముద్రం 16 – 6 2
మరిపెడ 15 7 3 –
మరమ్మతులకు గురవుతున్న వాహనాలు
చెత్త సేకరణకు అవస్థలు
తుప్పు పడుతున్న వెహికిల్స్
కాలనీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా!
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా!