
గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం గొప్ప వరం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడం గొప్ప వరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మేడారంలో తల్లుల గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో నిధులు కేటాయించి మేడారం తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల, వంశ చరిత్ర చిత్రాలతో గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో మంత్రిగా తాను, పూజారులు, జిల్లా అధికారులు భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ కొత్త సాలహారం నిర్మాణం పూర్తయిన తర్వాతే పాత సాలహారాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసేందుకు జిల్లా అధికారయంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క