
అధికంగా వసూలు!
● మీసేవ కేంద్రాల్లో దోపిడీ
● కొంతమంది నిర్వాహకులు
రెట్టింపు రుసుము వసూలు
● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
మహబూబాబాద్: జిల్లలో కొంతమంది మీసేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన రుసుము కంటే రెట్టింపు.. ఆపైన వసూలు చేస్తూ దరఖాస్తుదారులను అర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేంద్రాల్లో ధరల పట్టికలు మచ్చుకై నా కనిపించడం లేదు. కొంత మంది నిర్వాహకులు రుసుము స్లిప్‌లు ఇవ్వడం లేదు.. ఇస్తే తమ బండారం బయట పడుతుందని జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం దరఖాస్తును బట్టి కమీషన్ చెల్లిస్తున్నప్పటీ కాసులకు కక్కుర్తి పడి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేవలు ఇవే..
మీసేవ కేంద్రాల్లో ప్రధానంగా కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం, రేషన్ కార్డులు ,అగ్రికల్చర్ ల్యాండ్ విలువ, అగ్రికల్చర్ ఇన్‌కమ్ తదితర సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. అలాగే ఓపెన్ సైట్‌లో భాగంగా స్కాలర్ షిప్, భూభారతి, ఉద్యమం రిజిస్ట్రేషన్ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం)దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో డ్వాక్రా గ్రూపు రుణాల కోసం ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో మీసేవ కేంద్రాల్లో క్యూ కడుతున్నారు.
రెట్టింపు కంటే ఎక్కువగా..
కులం, ఆదాయం, నివాసం, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ తదితర సర్టిఫికెట్ల రుసుము రూ.45 ఉంది. కానీ కొంత మంది నిర్వాహకులు రూ.100పైగా తీసుకుంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు రూ. 95 ఉండగా రూ.200 వరకు వసూలు చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు దరఖాస్తు రుసుము రూ.45 ఉండగా రూ.100, లేబర్ కార్డు రెన్యూవల్ కోసం రూ.110 ఉండగా రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందా ఎక్కువ జిల్లా కేంద్రంలోనే జరుగుతోంది.
మీ సేవ కేంద్రాలకు వరం
డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఓపెన్ సైట్ అయినా ప్రతీ విషయంలో మీసేవ కేంద్రాలకు వెళ్లడం అలవాటుగా మారింది. అది నిర్వాహకులకు వరంగా మారింది. దీంతో రూ.100కు బదులు.. రూ.300 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని సర్వే పల్లి రాధాకృష్ణన్ సెంటర్‌లోని మీసేవ కేంద్రంలో రెట్టింపు కంటే అదనంగా వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కేంద్రంతో పాటు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని కేంద్రం, మున్సిపాలిటీ రోడ్డులో, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలోని మీసేవ కేంద్రంపై అధిక రుసుము వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.
పూర్తిగా సీజ్ కాదనే నమ్మకంతో..
నిబంధనలకు విరుద్ధంగా రుసుము వసూలు, ఇతర విషయాల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టి మొదటి హెచ్చరికగా రూ.2,000 జరిమానా విధిస్తారు. రెండోసారి ఫిర్యాదు వస్తే విచారణలో నిజమని తేలితే రెండో హెచ్చరికగా రూ.5000 జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా కోద్ది రోజులు మాత్రమే షాపు సీజ్ చేసే అధికారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధనలతో నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
అధికంగా వసూలు చేస్తే చర్యలు
మీసేవ కేంద్రాల్లో నిర్ణయించిన రుసుము మాత్రమే తీసుకోవాలి. అధికంగా వసూలు చేయవద్దు. తప్పని సరిగా రుసుము స్లిప్ ఇవ్వాలి. కేంద్రాల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే ముందుగా రెండుసార్లు జరిమానా విధించి ఆతర్వాత కేంద్రాన్ని సీజ్ చేస్తాం.
–ప్రశాంత్, ఈ–డిస్ట్రిక్ మేనేజర్