
ఘనంగా గజవాహన సేవ
గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఏడోరోజు స్వామివారికి దోపోత్సవం, గజవాహన సేవ, చక్రస్నానం కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై ప్రతిష్టించి దేవాలయం చూట్టూ మేళతాళాల నడుమ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి దోపోత్సవం, దేవాలయం ప్రాంగణంలోని కోనేటిలో స్వామివారికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గూడూరు సంజీవరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ భూక్య కస్నానాయక్ దంపతులు, మాజీ ఎంపీపీ లాలునాయక్, రాములు, చిరంజీవి, మల్సూర్, అర్చకులు రామాయణం అచ్చుతాచార్యులు, గోవింద్‌చార్యులు, రఘువెంకట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఓరుగల్లును మరువలేను
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. తన హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో అప్పుడు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు.
నేటి నుంచి క్రీడా ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్‌ఆఫ్‌వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్‌టెన్నిస్, బీచ్‌వాలీబాల్, తంగ్‌తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్‌బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్‌బాల్, లాన్‌టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్‌తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లను, యాటలను అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సుమారుగా పదివేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం సందడిగా మారింది.

ఘనంగా గజవాహన సేవ