
కార్యదర్శుల సతమతం
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలోని పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులను బదిలీల పేరిట భయపెడుతూ.. తమకు అనుకూలమైన వారికి ఒక చోట.. అనుకూలంగా లేని వారిని మరో చోటుకు బదిలీ చేయడం.. పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నామని చెప్పడం.. పై అధికారుల ఒత్తిడితోనే చేశామని సంబంధిత అధికారులు సర్థిచెప్పడం జిల్లాలో పరిపాటిగా మారింద పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిఒత్తిడితో సతమతం
శక్తికి మించిన పని చేయాలని పంచాయతీ కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి చేయడంతో ఉద్యోగాలను వదులకోలేక కొందరు.. ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు చేస్తూ మరికొందరు నెట్టుకొస్తున్నారు. గతంలో పనిభారం.. ఒత్తిడితో బయ్యారం మండలం ఇరుసులాపురం పంచాయతీ సెక్రటరీతోపాటు మరో ఇద్దరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో 461 పాతవి.. 12 కొత్తవాటితో మొత్తం 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో పని ఒత్తిడితో ఉద్యోగం విడిచి వెళ్లిపోగా.. కొందరు మెటల్నిటీ సెలవులు, ఇతర సెలవుల్లో వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 432 మంది పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి తాము పనిచేస్తున్న జీపీ కాకుండా అదనపు బాధ్యతలుగా మరికొన్ని జీపీలు అప్పగించారు. ఇందులో కొందరు ఎంపీడీఓలు.. పంచాయతీ సెక్రటరీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. ఇష్టానుసారంగా బదిలీల చేయడం, ఎంత పనిచేసినా.. అసంతృప్తి వ్యక్తం చేస్తూ సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీలు వాపోతున్నారు.
అప్పులు చేసి..
గత రెండు సంవత్సరాలుగా గ్రామ పరిపాలన వ్యవస్థ లేదు. దీంతో ఎస్‌ఎఫ్‌సీ, సీఎఫ్‌సీ నిధులు నిలిచిపోయాయి. దీనికి తోడు సక్రమంగా పన్నులు వసూలుకాని పంచాయతీలు ఉండగా.. అసలు పన్నులే చెల్లించని పంచాయతీలూ లేకపోలేదు. దీంతో పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్, ఫాగింగ్, వీధిలైట్లు, నీటి సరఫరా మోటార్ల మరమ్మతులు, బతుకమ్మ, దసరా, ఇతర ఉత్సవాల ఏర్పాట్లు, వీఐపీలు వచ్చినప్పుడు ఏర్పాట్లు ఇలా ఒక్కో పంచాయతీ సెక్రటరీ రూ.లక్ష నుంకి రూ.2 లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేశారు. ఇటువంటి పరిస్థితిలో తాను పనిచేస్తున్న జీపీ నుంచి బదిలీ చేస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలని సెక్రటరీలు ఆందోళనకు గురవుతున్నారు.
రెగ్యులరైజేషన్ అయ్యేముందు..
పంచాయతీ వ్యవస్థ బలోపేతం కోసం 2019లో ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీల నియామకం చేపట్టింది. నాలుగు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేసే విధంగా ఒప్పందంతో సర్వీస్‌లో చేర్చుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత రెగ్యూలరైజ్ చేస్తూ.. రెండు సంవత్సరాల అప్రంటీస్ పీరియడ్ పూర్తి చేశారు. ఇప్పుడు వీరికి పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. ఈ పరిస్థితిలో పలువురు ఎంపీడీఓలు ఇబ్బందులు పెట్టడం. మెమోలు ఇచ్చి.. సస్పెన్షన్ వేటు వేస్తుండడం గమనార్హం. ఆరు సంవత్సరాలు కష్టపడి పనిచేసి.. తీరా రెగ్యులర్ అయ్యే సమయంలో ఏ అధికారి నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఉద్యోగం చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనిచేస్తున్న తమ ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులపై పని భారం
సొంతఖర్చులతో అభివృద్ధి పనులు
ఇష్టారాజ్యంగా అధికారుల బదిలీలు
రెగ్యులరైజ్‌కు ముందు ఆటంకాలు
సృహతప్పి పడిపోయిన కార్యదర్శి
దంతాలపల్లి: మండలంలోని రైతు వేదిక వద్ద పంచాయతీ కార్యదర్శి శనివారం సృహతప్పి పడిపోయాడు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అజయ్ మండల కేంద్రంలోని రైతువేదికలో యూరియా బస్తాల పంపిణీ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అజయ్.. సృహతప్పి పడిపోవడంతో అధికారులు, రైతులు అజయ్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందించారు. చికిత్స అనంతరం అజయ్ కోలుకోవడంతో రైతులు, అధికారులు ఊపీరిపీల్చుకున్నారు. ఇదే విషయంపై ఎంపీఓ అప్సర్ పాషాను వివరణకోరగా.. జ్వరం ఎక్కువ ఉన్నవిషయం చెప్పలేదని, డ్యూటీకి వెళ్లాలని సూచించగా ఓకే అన్నాడని తెలిపారు.
నర్సింహులపేట మండలంలో పనిచేస్తున్న 14మంది పంచాయతీ కార్యదర్శులను రాత్రికి రాత్రి బదిలీ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎవరు మాటవినడం లేదు.. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీ చేశామని చెప్పారు. ఇది తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా రాజీనామా చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. అంతా సద్దుమణిగింది.

కార్యదర్శుల సతమతం