
ప్రజల ముంగిట పాలన
సంక్షేమ పథకాల అమలే కీలకం
● యూరియా కొరత లేకుండా చర్యలు
● ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్: ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన చేస్తున్నారని రాష్ట్ర విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సొంతింటి కల నెరవేరుస్తూ..
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పా రు. ఇప్పటి వరకు జిల్లాకు 10,651 ఇళ్లు మంజూరు చేసి.. 9,858 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశామని, నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూల్స్‌గా ఏర్పాటు నుంచి విశ్వవిద్యాలయాల బోధన వరకు అనేక మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించామని అన్నారు. అదేవిధంగా సబ్బండ వర్ణాల పిల్లలకు ఒకే ఆవరణలో బోధన జరిపేలా ప్రతీ నియోజకవర్గంలో 25ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
అన్నదాతకు అండగా..
జిల్లాలోని రూ.2లక్షల లోపు రుణం ఉన్న రైతులను రుణ విముక్తి చేయడం కోసం నిధులు కేటాయించామన్నారు. ఈ నిధులతో జిల్లాలో మూడు విడతలుగా 65,147 మంది రైతులకు రూ.570కోట్లు వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12వేల చొప్పున అందిస్తున్నామన్నారు. రైతు పండించిన సన్న ధన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. 558 రేషన్ షాపుల ద్వారా 2.70లక్షల కార్డులకు 5,127 టన్నుల సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. 31,052 కొత్త రేషన్ కార్డుల మంజూరు, 41,095 మందివి కొత్తగా పేర్లు నమోదు చేశామని చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక అభివృద్ధికోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిలో పారదర్శక పాలన అందించేందుకు 180 క్లస్టర్లకు 179మంది గ్రామ పరిపాలనాధికారులను నియమించామని చెప్పారు. వివిధ కారణాలతో యూరియా సరఫరాలో కొంత అసౌకర్యం కలిగిందని, రైతులను సమన్వయం చేసుకుంటూ.. నిజమైన రైతులకు యూరియా అందించడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఈమేరకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధ్‌ర్ రాంనాథ్ కేకన్‌ను విప్ సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని విప్ రాంచంద్రునాయక్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. నిరుపేదలకు పెద్దాసుపత్రుల్లో ఖరీదైన వైద్యం కోసం 163 రకాల చికిత్సలకు రూ.10లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 17,308 మందికి చికిత్స చేయించేందుకు రూ. 76.73కోట్లు ఖర్చు చేసిందన్నారు. రూ. 500లకే వంట గ్యాస్ అందిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో 1.34లక్షల మందికి ప్రభుత్వం రూ.53.08కోట్ల సబ్సిడీ చెల్లించినట్లు వివరించారు.

ప్రజల ముంగిట పాలన

ప్రజల ముంగిట పాలన