
ఘనంగా పెద్దల పండుగ
గూడూరు: మండల కేంద్రంలోని ఆదివాసీ కోయదొరలు బుధవారం కొత్తల (పెద్దల) పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గ్రామ దొర పొడుగు క్రిష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఉత్తరకార్దె మొదటి పాదంలో బుధవారం ఆదివాసీ పెద్దల పండుగ జరుపుకుంటామని తెలిపారు. కాగా చెంద్రుగూడెం శివారు అటవీ ప్రాంతంలో, మచ్చర్ల శివారు కొమురంభీనగర్‌లో కొత్తల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ దొరలు చాపల నాగయ్య, దారం స్వామి, అయిలబోయిన వీరయ్య, బత్తుల శ్రీనివాస్, పెనుక ప్రభాకర్, కాక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడలో..
కొత్తగూడ: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ తెగలు పెద్దల పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్దల స్మరణలో భాగంగా ఆదివాసీ పోరాట యోధులు కొమురం భీం, బీర్సా ముండాకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ పూజారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, తుడుందెబ్బ నాయకులు, ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.