
ఆదివాసీ సంస్కృతి
ప్రతిబింబించేలా గద్దెల విస్తరణ
ఎస్‌ఎస్‌తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. సోమవారం మేడారంలో పూజారులు, ఆర్కిటెక్, దేవాదాయశాఖ అధికారులు, కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీశ్, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతరలో 20 ఏళ్ల తర్వాత మంత్రిగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గద్దెల ప్రాంగణాల్లో మార్పులు, చేర్పులు చేయడంలో భాగంగా కొద్ది రోజులుగా పూజారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, ఆదివాసీ ఆచారాలు, చరిత్ర, జీవన విధానాల ప్రకారం నిర్మాణ పనులు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించారన్నారు. చిన్న గద్దెల మార్పిడితో అపచారం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని, పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయన్నారు. గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పు, 80 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పూజారుల తుది నిర్ణయాల మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం ముందు ఉంచుతామని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూజారులతో కలిసి మేడారంలో నూతన మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు ముణిందర్, వెంకటేశ్వర్లు, రఘుపతి, రమేశ్, సారయ్య, స్వామి, గోవర్ధన్, భోజరావు, కృష్ణయ్య, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు
పూజారుల నిర్ణయం మేరకే మాస్టర్ ప్లాన్
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
సీతక్క