
నాన్‌బోర్డర్లు ఖాళీ చేయాల్సిందే..
కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్లలోని నాన్‌బోర్డర్లు గదులను వేకెట్ చేయాల్సిందేనని రిజిస్ట్రార్ వి.రామచంద్రం స్పష్టం చేశారు. వర్సిటీలో శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులపై పలువురు దాడిచేసిన ఘటన అనంతరం అదేరోజు రాత్రి, ఆదివారం రాత్రి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. హాస్టళ్లల్లో నాన్‌బోర్డర్ల వల్ల తలెత్తుతున్న సమస్యలపై సోమవారం సాయంత్రం పరిపాలన భవనంలోని కమిటీ హాల్‌లో అన్ని విభాగాధిపతితులతోనూ, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో హాస్టళ్ల డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. నాన్‌బోర్డర్లు ఈనెల 17న సాయంత్రం వరకు వేకెట్ చేయాలని హాస్టళ్ల డైరెక్టర్ ఎల్‌పీ రాజ్‌కుమార్ సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. అలుమనాక్ ప్రకారం ఈనెల 20 నుంచి మధ్యాహ్నం లంచ్ తర్వాత హాస్టళ్లను మూసివేస్తున్నట్లు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. (దసరా సెలవుల నేపథ్యంలో) హాస్టళ్లలోని విద్యార్థులు నిబంధనలు పాటించకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.
విద్యార్థులతో సమావేశం
కేయూలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హనుమకొండ, కాజీపేట ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్‌రెడ్డి, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో యూనివర్సిటీకి వచ్చారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్‌లాల్ సమక్షంలో హాస్టళ్ల విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు.
సర్క్యూలర్ జారీ చేసిన హాస్టళ్ల డైరెక్టర్